Anagani Sathya Prasad: జగన్ కు ఈ అవార్డులన్నీ ఇవ్వొచ్చు: మంత్రి అనగాని సత్యప్రసాద్
- జగన్-అదానీ అంశంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందన
- జగన్ నిజాన్ని ఒప్పుకోకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శలు
- అవార్డుల జాబితాతో ప్రకటన విడుదల చేసిన మంత్రి
జగన్ రెడ్డి... అదానీ విద్యుత్ కుంభకోణం కేసులో మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు.
అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర ప్రజల నెత్తిన రెండు లక్షల కోట్ల రూపాయల భారాన్ని మోపిన జగన్ రెడ్డి... నిజాన్ని ఒప్పుకోకుండా... తానేదో తక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నానని, అందుకు తనకు బిరుదులు, అవార్డులు కూడా ఇవ్వొచ్చంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
"జగన్ రెడ్డికి నిజంగానే అవార్డులు, బిరుదులు ఇవ్వొచ్చు. తన అవినీతి సామ్రాజాన్ని అంతర్జాతీయ స్తాయికి తీసుకెళ్లి ప్రపంచ స్థాయిలో అవినీతి పరుడిగా పేరు సంపాదించినందుకు ‘ఇంటర్నేషనల్ క్రిమినల్’ అనే అవార్డు ఇవ్వొచ్చు. ప్రజా రాజధాని అమరావతి పై హామీని తుంగలో తొక్కినందుకు, హామీలు ఇచ్చి ప్రజలను మోసిగించినందుకు ‘నమ్మక ద్రోహి’ అనే అవార్డు కచ్చితంగా ఇవ్వాల్సిందే.
ఆర్ధిక నేరగాడిగా జైలు శిక్ష అనుభవించి దేశంలోనే అందరి కన్నా ఎక్కువ కాలం బెయిల్ పైన బయట ఉన్న వ్యక్తిగా ‘ బెయిల్ పక్షి’ అనే బిరుదు ఇవ్వాల్సిందే. పదే పదే అబద్ధాలు చెబుతూ... చెయ్యని, చేయలేని గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డికి ‘పిట్టల దొర’ టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుంది.
సిగ్గు లజ్జా ఉన్న ఏ వ్యక్తి కూడా చేయని విధంగా సొంత చెల్లెళ్లనే రోడ్ల మీదకు ఈడ్చి వారి పరువు తీసే లాగా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టించి, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడినందుకు ‘ఆంధ్ర భ్రష్ట రత్న’ అవార్డు ఇవ్వొచ్చు. తన ఐదేళ్ల పాలనలో హత్యలు, దాడులతో హడలెత్తించినందుకు ‘నరరూప రాక్షసుడు’ బిరుదు సరిగ్గా సరిపోతుంది" అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు.
ఈ మేరకు ఆయన నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు.