Road Accident: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. ఐటీ ఉద్యోగులైన దంపతుల దుర్మరణం
- పిల్లలు మారాం చేయడంతో అర్ధరాత్రి బిర్యానీ కోసం బైక్‌పై దంపతులు
- తాగిన మత్తులో కారును డ్రైవ్ చేస్తూ వీరి బైక్‌ను ఢీకొట్టిన నిందితుడు
- అంతకుముందే సన్‌సిటీలో మరో ప్రమాదం చేసి తప్పించుకుని వచ్చిన నిందితుడు
- ఘటనలో మరికొందరికి గాయాలు
- హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో బీడీఎల్ ఉద్యోగి, ఆయన భార్య దుర్మరణం
తప్పతాగి కారుతో రోడ్డెక్కిన ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయిన భార్యాభర్తల మృతికి కారణమయ్యాడు. మరో నలుగురు ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. లంగర్‌హౌస్‌కు చెందిన మోనా ఠాకూర్ (35)కు రెండేళ్ల క్రితం బంజారాహిల్స్‌కు చెందిన దినేశ్ గిరి (38)తో రెండో వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని గొల్లబస్తీలో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. మూడ్రోజుల క్రితం గోవా ట్రిప్‌కు వెళ్లిన దంపతులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చారు. పిల్లలు బిర్యానీ కావాలని మారాం చేయడంతో రాత్రి 12 గంటల సమయంలో దంపతులు ఇద్దరూ బైక్‌పై బయటకు వచ్చారు.
లంగర్‌హౌస్ నుంచి నానల్‌నగర్ వైపు వెళ్తుండగా ఇంద్రారెడ్డి వంతెనపై నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత మరో రెండు బైక్‌లను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. అనంతరం రోడ్డు పక్కన నిలిపివున్న ఆటో ట్రాలీని ఢీకొట్టి ఆగింది. కారు బలంగా ఢీకొట్టడంతో ఎగిరిపడిన మోనా అక్కడికక్కడే మృతి చెందగా, దినేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చంచల్‌గూడకు చెందిన మహ్మద్ అబ్బాస్, జీడిమెట్ల సూరారం ప్రాంతానికి చెందిన షేక్ అక్తర్, జూపార్క్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జావీద్ తీవ్రంగా గాయపడ్డారు.
అంతకుముందే మరో యాక్సిడెంట్
లంగర్‌హౌస్ ఘటనలో నిందితుడిని వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరుకు చెందిన ప్రణీత్ (30)గా గుర్తించారు. ఓ ప్రైవేటు బీమా సంస్థలో పనిచేస్తున్న నిందితుడు హైదరాబాద్‌లో ఉండే స్నేహితుడిని కలిసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో సన్‌సిటీలో మద్యం తాగి అదే మత్తులో కారెక్కాడు. అక్కడే ఓ బైక్‌ను ఢీకొట్టడంతో స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. వారి నుంచి తప్పించుకుని వస్తూ లంగర్‌హౌస్‌లో బీభత్సం సృష్టించి ఇద్దరి ప్రాణాలు బలిగొన్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో ఘటనలో దంపతుల మృతి
హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై మీర్జాగూడ గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ప్రొద్దుటూరుకు చెందిన మేకల లక్ష్మారెడ్డి (62), భాగ్యలక్ష్మి (48) దంపతులు. లక్ష్మారెడ్డి సంగారెడ్డి జిల్లాలోని బీడీఎల్‌లో పనిచేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం దంపతులిద్దరూ కలిసి చేవెళ్ల మండలం దేవరంపల్లిలో ఉంటున్న తోడల్లుడి వద్దకు కారులో బయలుదేరారు.
ఈ క్రమంలో మీర్జాగూడ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వీరి కారును బలంగా ఢీకొనడంతో భాగ్యలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మారెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. వీరి పెద్ద కుమారుడు లండన్‌లో ఉద్యోగం చేస్తుండగా, చిన్నకుమారుడు త్వరలోనే ఎయిర్ ఇండియాలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.