Football Match: ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్ మధ్య గొడవ.. గినియాలో వంద మంది మృతి

Over 100 Killed Amid Clashes Between Fans At Football Match In Guinea
  • రిఫరీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫ్యాన్స్
  • మైదానంలోకి చొరబడి మరీ కొట్లాడుకున్న అభిమానులు
  • మార్చురీ నిండిపోవడంతో ఆసుపత్రి వరండాలో మృతదేహాలు
గినియాలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవ వందమందికి పైగా అభిమానుల ప్రాణాలు తీసింది. స్టేడియంతో పాటు సిటీ మొత్తం ఉద్రిక్తంగా మారింది. మ్యాచ్ రిఫరీ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ అభిమానులు మైదానంలోకి చొరబడి గొడవపడ్డారు. రెండు జట్ల అభిమానులు చొచ్చుకు రావడంతో స్టేడియం కాస్తా రణరంగంగా మారింది. తొక్కిసలాట, కొట్లాటలతో చాలామంది అభిమానులు చనిపోయారు. మైదానంలో, స్టేడియం ఆవరణలో కిందపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అందులో చాలామంది అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు. పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలోని రెండో అతిపెద్ద నగరం జెరెకోర్ లో ఆదివారం చోటుచేసుకుందీ ఘోరం.

మార్చురీ మొత్తం నిండిపోవడంతో మృతదేహాలను ఆసుపత్రి వరండాలో వరుసగా పడుకోబెట్టారు. కనుచూపుమేరలో మొత్తం డెడ్ బాడీలే ఉన్నాయని స్థానికుడు ఒకరు చెప్పారు. కనీసం వందమంది చనిపోయి ఉంటారని, గాయపడ్డ వారి సంఖ్య కూడా ఎక్కువేనని వైద్యులు తెలిపారు. కాగా, స్టేడియంలో గొడవకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రణరంగంగా మారిన స్టేడియం నుంచి ప్రాణభయంతో జనం పరుగులు పెట్టడం ఇందులో కనిపిస్తోంది. గినియా సైనిక పాలకుడు మామాడి డౌంబోయా గౌరవార్థం నిర్వహించిన ఫుట్ బాల్ టోర్నమెంట్ లో ఈ విషాదం చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది.
Football Match
Fans Fight
100 dead
Guinea
African Country
Viral Videos

More Telugu News