Botsa Satyanarayana: ఆరు నెలల్లో చేసిన రూ. 70 వేల కోట్ల అప్పులు ఎక్కడకు పోయాయి?: బొత్స సత్యనారాయణ
- కూటమి ప్రభుత్వంపై బొత్స విమర్శలు
- ఇప్పటి వరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదని విమర్శ
- బెల్టు షాపులకు కూడా వేలం వేస్తున్నారని మండిపాటు
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిందని... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని... యూనిట్ కు రూ. 1.20 పైంచారని బొత్స అన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారాన్ని పెంచుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని... కూటమి ప్రభుత్వం గత 6 నెలల్లో చేసిన రూ. 70 వేల కోట్ల అప్పులు ఎక్కడికి పోయాయని అడిగారు. మీ సోకులకు వాడుకుంటున్నారా? అని ప్రశ్నించారు. పెన్షన్లు తప్ప ఒక పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందని బొత్స అన్నారు. గతంలో పథకాలు అందడం వల్ల మార్కెట్ మంచిగా ఉండేదని చెప్పారు. ఇప్పుడు వ్యాపారాలేమీ జరగడం లేదని అన్నారు. వాటాల కోసం ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారని... ఆ గొడవలకు చంద్రబాబు పంచాయితీ చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. బెల్ట్ షాపులకు కూడా వేలం వేస్తున్నారని... తమ సమీప గ్రామంలో బెల్టు షాపుకు రూ. 50 లక్షలకు వేలం వేశారని చెప్పారు.