Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ
- నేడు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్
- చంద్రబాబుతో రెండు గంటల పాటు సమావేశం
- పలు కీలక అంశాలపై చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటన వివరాలను పవన్... చంద్రబాబుకు వివరించారు. కేంద్రమంత్రులతో భేటీ వివరాలను సీఎంతో పంచుకున్నారు.
ప్రధానంగా కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. రేషన్ బియ్యం తరలింపునకు ఎలా అడ్డుకట్ట వేయాలి? ఎలాంటి విధివిధానాలు అమలు చేయాలనేదానిపై చర్చించినట్టు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగవంతం, తాజా రాజకీయ పరిస్థితుల గురించి, మరో విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా ప్రముఖంగా చర్చించినట్టు తెలుస్తోంది.
కూటమి పార్టీల్లోని కష్టపడి పనిచేసే నేతలకు మిగిలి ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, అందుకోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.