K Kavitha: కేసీఆర్ ను రేవంత్ 'కలుపు మొక్క' అనడంపై కవిత స్పందన
- కేసీఆర్ ను కలుపుమొక్క అన్న రేవంత్
- తెలంగాణను సాధించిన శక్తి కేసీఆర్ అన్న కవిత
- సీఎం, మంత్రులు తిట్లతో పాలన సాగిస్తున్నారని విమర్శ
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి కలుపు మొక్క అని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పీకేయడానికి కేసీఆర్ అంటే ఒక మొక్క కాదని... కేసీఆర్ ఒక వేగుచుక్క అని పేర్కొన్నారు. తెలంగాణను సాధించిన శక్తి కేసీఆర్ అని కొనియాడారు.
కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని కవిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు తిట్లతోనే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారేవని... ఇప్పుడు తిట్లు పారుతున్నాయని మండిపడ్డారు. రైతుబంధును శాశ్వతంగా తొలగించేందకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.