Amaravati: అమరావతిలో రాజధాని పనుల పునఃప్రారంభం
- తొలి దశలో రూ. 11,467 కోట్లతో పనుల ప్రారంభానికి సీఆర్డీయే ఆమోదం
- మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం
- రోడ్లు, రిజర్వాయర్ల నిర్మాణం
- అధికారుల నివాస భవనాల నిర్మాణం కొనసాగింపు
- ప్రపంచబ్యాంక్, ఏడీబీ నిధుల సాయం
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. తొలిదశలో రూ. 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిన్న ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీఆర్డీయే అథారిటీ 41వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. వీటిలో చాలా వరకు పనులను ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు సహకారంతో చేపడతారు.
మొత్తం రూ. 11,467 కోట్లలో రూ. 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనులు చేపట్టగా, రూ. 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాల్వల అభివృద్ధి, మూడు రిజర్వాయర్లు నిర్మిస్తారు. అలాగే, రూ. 3,525 కోట్లతో అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస భవన నిర్మాణాలను పూర్తిచేస్తారు. రూ. 3,859 కోట్లతో భూసేకరణలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన స్థలాల లేఅవుట్‌ల అభివృద్ధి పనులను కొనసాగిస్తారు. అలాగే, 2019కి ముందున్న టెండర్లు రద్దు చేసి కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలుస్తారు. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రూ. 948.10 కోట్ల సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలుస్తారు. ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల సీఆర్డీయే నష్టపోయే రూ. 270.71 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది.