Kamilla Belyatskaya: సముద్రపు అలలకు కొట్టుకుపోయిన రష్యన్ నటి.. వైరల్ వీడియో!
- థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్ ద్వీపంలోని బీచ్‌లో ఘటన
- రష్యన్ నటి కెమిల్లా బెల్యాట్స్కాయ భారీ అలలకు కొట్టుకుపోయి మృతి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన తాలూకు వీడియోలు
థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్ ద్వీపంలోని బీచ్ ఒడ్డున యోగా చేస్తున్న రష్యన్ నటి కెమిల్లా బెల్యాట్స్కాయ భారీ అలలకు కొట్టుకుపోయి చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పటిదాకా చదును బండరాయిపై ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న ఆమెను ఎగసిపడిన అలలు సముద్రంలోకి లాగాయి. కెమిల్లాను రక్షించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆమెను రక్షించడంలో విఫలమయ్యాడు.
కొద్దిసేపటికే ఆమె మృతదేహం బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆమె కొట్టుకుపోయిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక రెస్క్యూ టీమ్‌లు వేగంగా స్పందించి, నటి సముద్రంలో కొట్టుకుపోయిన 15 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాయి. అయితే, తీవ్రమైన పరిస్థితులు వారి ప్రయత్నాలకు ఆటంకం కలిగించాయి. దాంతోఒ వారు ఆమెను రక్షించలేకపోయారు.
ఇక కెమిల్లా ఇంతకుముందు ప్రమాదం జరిగిన ఈ ప్రదేశం పట్ల తన ప్రేమను వ్యక్తం చేశారు. భూమిపై అత్యుత్తమ ప్రదేశంగా ఆమె పేర్కొన్నారు. ఈ నిర్దిష్ట ప్రదేశాన్ని పదేపదే సందర్శించారామె. ఈ ప్రదేశాన్ని మెచ్చుకుంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. "నాకు స్యామ్యూయ్ ద్వీపం అంటే చాలా ఇష్టం. కానీ ఈ ప్రదేశం, ఈ రాతి బీచ్ నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమమైంది. చాలా సంతోషంగా ఉంది" అని వీడియోలు షేర్ చేశారు. కాగా, 24 ఏళ్ల కెమిల్లా తన ప్రియుడితో కలిసి థాయ్‌లాండ్‌లో విహారయాత్రలో ఉన్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ 'మెట్రో' వెల్లడించింది.