AP Rains: ఏపీని వెంటాడుతున్న మరో అల్పపీడనం... మరికొన్ని రోజులు వర్షాలే!
- డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ మధ్య అల్పపీడనం ఏర్పడే ఛాన్స్
- దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువని ఐఎండీ అంచనా
- ఫెయింజల్ తుఫాన్ తీరం దాటినా ఆగని వర్షాలు
ఫెయింజల్ తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ పై కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం తుఫాన్ తీరం దాటింది. అయితే, రాష్ట్రంలో మంగళవారం కూడా పలుచోట్ల వర్షం కురిసింది. ఒంగోలు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లు జలమయంగా మారి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఒంగోలులో బస్టాండ్ కూడలి, కర్నూల్ రోడ్డులో భారీగా వర్షపునీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇక, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వాగుల ఉద్ధృతి పెరిగింది. మద్దెలవంక వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దేవళంపేట - వెదురుకుప్పం ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. బాపట్ల జిల్లాలోనూ పలు ప్రాంతాలు జలమయంగా మారాయి.
మరోవైపు, ఫెయింజల్ తుఫాన్ ప్రభావం తగ్గిందనుకునే లోపే వాతావరణ శాఖ ఏపీకి మరో హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. తమిళనాడును ఆనుకుని ఏర్పడే ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్పింది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండడం, ఐఎండీ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.