KTR: ఉద్యమకారులపై దమనకాండ, కేసీఆర్ అరెస్ట్‌ను తట్టుకోలేక శ్రీకాంతచారి ఆత్మహత్య చేసుకున్నాడు: కేటీఆర్
- శ్రీకాంతచారి ప్రాణత్యాగం ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందన్న కేటీఆర్
- శ్రీకాంతచారి ప్రాణత్యాగాన్ని ప్రజానీకం మరువదని స్పష్టీకరణ
- జోహార్ శ్రీకాంతచారి అంటూ హరీశ్ రావు ట్వీట్
తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండను, కేసీఆర్ అరెస్ట్‌ను చూసి తట్టుకోలేక శ్రీకాంతచారి ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ్రీకాంతచారి ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందని గుర్తు చేసుకున్నారు. ఆయన అమరత్వం గొప్పదని, ఆయన ప్రాణత్యాగాన్ని తెలంగాణ ప్రజానీకం ఎన్నటికీ మరువదన్నారు.
శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. "శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా ఆయనకు జోహార్లు అర్పిస్తున్నాను. జోహార్ శ్రీకాంతచారి! జై తెలంగాణ" అని రాసుకొచ్చారు.
హరీశ్ రావు నివాళి
మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి 15వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అగ్నికి ఆహుతి అవుతూ కూడా 'జై తెలంగాణ' అని నినదించిన పోరాటయోధుడు శ్రీకాంతచారి అని పేర్కొన్నారు. కేసీఆర్ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్నాడన్నారు. జోహార్ శ్రీకాంతచారి అని ట్వీట్ చేశారు.