Ramdas Athawale: ఏక్‌నాథ్ షిండే ముందు మూడు దారులున్నాయి: కేంద్రమంత్రి అథవాలే

Ramdas Athawale Says Shinde Upset Over Losing Top Job

  • డిప్యూటీ సీఎం, కూటమి చైర్మన్, కేంద్రమంత్రి ఆప్షన్స్ ఉన్నాయని వెల్లడి
  • క్రితంసారి బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ షిండేకు అవకాశమిచ్చారన్న అథవాలే
  • ఈసారి బీజేపీ సీఎం పదవిని వదులుకోవడానికి సిద్ధంగా లేదని వెల్లడి
  • షిండే కలత చెందినప్పటికీ బీజేపీ నిర్ణయం మార్చుకోదన్న కేంద్రమంత్రి

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముందు మూడు దారులు ఉన్నాయని ఆర్పీఐ అధినేత, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం లేదా మహాయుతి కూటమి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం లేదా కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడం... ఈ మూడింటిలో ఏదో ఒకటి ఆయన ఎంచుకోవాలన్నారు. 

ఈసారి బీజేపీయే ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటుందని అథవాలే స్పష్టం చేశారు. ఆపద్ధర్మ సీఎంగా ఉన్న షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశముందన్నారు.

క్రితంసారి శివసేన పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు బీజేపీకి ఎక్కువ బలం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఏక్‌‍నాథ్ షిండేకు ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొనసాగారన్నారు. కానీ ఈసారి కూడా సీఎం పదవిని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. బీజేపీ గతంలో కంటే ఈసారి ఎక్కువ స్థానాలను గెలుచుకుందన్నారు.

మరోసారి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు మహాయుతి కూటమిలోని బీజేపీ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఏక్‌నాథ్ షిండే కలత చెందిన మాట వాస్తవమే అన్నారు. అయినప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితి లేదన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి 230 సీట్లు రాగా... అందులో బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు దక్కించుకున్నాయి.

  • Loading...

More Telugu News