Online Reviews: సినిమాలపై ఆన్ లైన్ రివ్యూలు నిషేధించాలంటూ పిటిషన్... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు

Madras High Court issues notces to Centre and Tamil Nadu govt

  • ఎప్పటినుంచో చర్చనీయాంశంగా... నెగెటివ్ రివ్యూలు
  • మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన తమిళ నిర్మాతల సంఘం
  • సినిమా విడుదలై మూడ్రోజుల వరకు రివ్యూలను నిషేధించాలని పిటిషన్
  • విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు

కొత్త సినిమాలు రిలీజైనప్పుడు రివ్యూలు వాటిపై ఎంతో ప్రభావం చూపిస్తుంటాయి. పాజిటివ్ రివ్యూలతో ఫర్వాలేదు కానీ, నెగెటివ్ రివ్యూలతో సినిమాలకు తీవ్ర నష్టం కలుగుతుందని నిర్మాతలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. ఈ క్రమంలో తమిళ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

సినిమా రిలీజైన తేదీ నుంచి మూడ్రోజుల వరకు ఆన్ లైన్ రివ్యూలపై నిషేధం విధించాలంటూ తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (టీఎఫ్ఏపీఏ) మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రివ్యూలపై మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని టీఎఫ్ఏపీఏ న్యాయస్థానాన్ని కోరింది. 

సినిమా విడుదలైన మూడ్రోజుల వరకు యూట్యూబ్ చానళ్లలోనూ, సోషల్ మీడియా పేజీల్లోనూ రివ్యూలు రాకుండా కట్టడి చేయాలని విజ్ఞప్తి చేసింది. విమర్శకులు సినిమాలపై రివ్యూలు ఇవ్వడంలో తప్పులేదని, అది వారి హక్కు అని... కానీ వ్యక్తిగత కక్షలతో ఓ సినిమాపై విద్వేషం వ్యాప్తి చేయడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని టీఎఫ్ఏపీఏ పేర్కొంది. 

గత కక్షలు, వ్యాపార వైరం కారణంగా కొందరు వ్యక్తులుగా తరచుగా నెగెటివ్ రివ్యూలు వ్యాపింపజేస్తున్నారని, తద్వారా ప్రజలు సినిమా చూడకముందే తప్పుదారి పట్టిస్తున్నారని నిర్మాతల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. 

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, యూట్యూబ్ కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎస్.సౌందర్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ, నోటి మాటగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రివ్యూలు, సినిమాలపై విమర్శలు వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందకు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఆ హక్కులను ఎలా కాదనగలమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News