Sanjay Raut: ఫడ్నవీస్ సీఎం కాకుండా ఏక్నాథ్ షిండే కుట్రలు: సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
- షిండే వెనుక ఢిల్లీలోని ఓ సూపర్ పవర్ ఉందన్న సంజయ్ రౌత్
- ఢిల్లీలోని బలమైన శక్తి లేకుంటే షిండే కుయుక్తులు చేసేవారు కాదని వ్యాఖ్య
- ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా మహాయుతిలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుట్రలు చేస్తున్నారని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ కుయుక్తులకు ఢిల్లీలోని ఓ సూపర్ పవర్ షిండేకు అండగా నిలుస్తోందన్నారు.
ఆయనకు ఢిల్లీలోని బలమైన శక్తి అండ లేకుంటే కనుక మెజార్టీ స్థానాలు కలిగిన బీజేపీకి వ్యతిరేకంగా పదవి కోసం ఇన్ని ప్రయత్నాలు చేసేవారు కాదన్నారు. ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా మహాయుతిలో కుట్రలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా, వైద్యం కోసం థానే వెళ్లడానికి ముందు ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ... సీఎం ఎంపిక విషయంలో బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటిస్తానని వెల్లడించారు.
దీంతో ఆయన ఉపముఖ్యమంత్రి పదవికి అంగీకరించి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకు హోంమంత్రి పదవిని ఇవ్వాలని షిండే పట్టుబడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఈరోజు షిండేతో చర్చలు జరిపారు. డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించాలని సూచించారు.