Google Maps: గూగుల్ మ్యాప్ ను ఫాలో అయ్యి... కాలువలో పడిపోయిన కారు
- యూపీలో ఘటన
- గూగుల్ మ్యాప్స్ సందేశాల ప్రకారం డ్రైవ్ చేసిన వ్యక్తి
- కోతకు గురైన రోడ్డు
- చూసుకోకుండా వచ్చి కాలువలో పడిపోయిన వైనం
మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళుతున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతుంటాం. చాలావరకు గూగుల్ మ్యాప్స్ యాప్ ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే, ఉత్తరప్రదేశ్ లో గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవ్వాలన్న ఓ వ్యక్తి నిర్ణయం వికటించింది.
గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ వెళ్లిన కారు... నేరుగా ఓ కాలువలో పడిపోయింది. యూపీలోని రాయ్ బరేలీ-పిలిభిత్ రహదారిపై ఈ ఘటన జరిగింది.
దివ్యాన్షు సింగ్ అనే వ్యక్తి తన కారులో మరో ఇద్దరితో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఆ రూట్ కు కొత్త కావడంతో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించాడు. అయితే, గూగుల్ మ్యాప్స్ సందేశాలను పక్కాగా అనుసరిస్తూ వెళ్లిన ఆ కారు బర్కాపూర్ గ్రామం సమీపంలో కాలాపూర్ కెనాల్ లో పడిపోయింది. రోడ్డు కోతకు గురైన విషయం గమనించకుండా, గూగుల్ సందేశాల ప్రకారం డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది.
కాగా, కారులోని ముగ్గురికీ ఎలాంటి హాని జరగలేదు. ప్రమాదంపై స్పందించిన అధికారులు ఓ క్రేన్ ను తెప్పించి, కాలువలో పడిపోయిన కారును బయటికి తీశారు. గత పది రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం రెండోసారి.
ఇటీవల గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ వచ్చిన ఓ వాహనం సగం పూర్తయిన ఫ్లైఓవర్ పైనుంచి కిందడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.