Chiranjeevi: బిగ్ అనౌన్స్‌మెంట్.. చిరంజీవి హీరోగా నాని నిర్మిస్తున్న చిత్రం!

Srikanth Odela Directed to Megastar Chiranjeevi and Produced by Natural Star Nani

  • చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబోను సెట్ చేసిన నాని
  • సుధాక‌ర్ చెరుకూరితో కలిసి నేచుర‌ల్ స్టార్‌ సంయుక్త నిర్మాణం
  • ప్ర‌త్యేక పోస్ట‌ర్‌తో ఈ క్రేజీ కాంబినేష‌న్‌ను ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌

ఇన్నాళ్లు పుకారుగా ఉన్న ఓ వార్త ఇప్పుడు నిజమైంది. మెగాస్టార్ చిరంజీవి న‌టించే త‌దుప‌రి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేంది 'ద‌స‌రా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల అని అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. మ‌రో విశేషం ఏంటంటే, ఈ చిత్రాన్ని నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించ‌నున్నారు. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌తో క‌లిసి నాని త‌న‌ యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 

ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ ఓ స్పెష‌ల్‌ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రక్తం కారుతున్న చిరు చేతిని చూపించారు. దీనికి 'అతను హింసలో శాంతిని పొందుతాడు' అనే క్యాప్షన్ ఇచ్చారు.

"ఆయన స్ఫూర్తితోనే నేను పెరిగాను. ప్రతిసారి ఆయన కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడ్డాను. ఈ క్రమంలో నా సైకిల్ కూడా కోల్పోయాను. ఆయనతోనే సెలబ్రేషన్స్ చేసుకున్నాను. ఇప్పుడాయనని సమర్పిస్తున్నాను. ఇది ఫుల్ సర్కిల్" అంటూ నాని ట్వీట్ చేశారు.  

ఇదిలావుంచితే, తన మొదటి సినిమా ‘దసరా’ తర్వాత మరోసారి నానినే శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ‘ది పారడైజ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ సినిమా పూర్తవగానే మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల సినిమా ప్రారంభం కానుంది. మ‌రోవైపు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి న‌టిస్తున్న‌ విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.

  • Loading...

More Telugu News