strange facts: భూమ్మీద ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ కాదు.. మీకు తెలియని రహస్యాలు ఇవిగో!
- భూఉపరితలాన్ని, సముద్రపు అడుగు భాగాన్ని లెక్కిస్తే మారిపోయే అంశాలు
- అత్యంత లోతైన, ఎత్తయిన, విభిన్నమైన చిత్రాలు ఎన్నో...
- అలాంటి కొన్ని చిత్రమైన విశేషాలు మీకోసం...
భూమ్మీద ఎత్తయిన పర్వత శిఖరం ఏదంటే.. చాలా మంది టక్కున ‘ఎవరెస్ట్ (#everest)’ అని చెబుతారు. లోతైన ప్రదేశం అంటే... కాస్త ఆలోచిస్తుంటారు. అయితే వీటిలో కొంత వరకే నిజాలు. పరిస్థితులను బట్టి, వాటి స్థానాన్ని బట్టి ఈ లెక్కలు మారిపోతుంటాయి. భూమ్మీద ఉన్న అలాంటి కొన్ని చిత్రమైన సంగతులు తెలుసుకుందామా...
ఎవరెస్ట్ కాదు... మౌనా కీ (mauna kea)
భూమి ఉపరితలంపై భాగంలో ఎత్తయిన పర్వత శిఖరం ఎవరెస్ట్ అన్నది సరైనదే. కానీ భూమిపై మొత్తంగా సముద్రాల అడుగు భాగం నుంచి ఉపరితలంపై వరకు ఉన్న అన్ని పర్వత ప్రాంతాలను పరిశీలిస్తే... హవాయి (Hawaii)లోని మౌనా కీ శిఖరం అత్యంత ఎత్తయినది. ఎవరెస్ట్ ఎత్తు సముద్ర మట్టం నుంచి లెక్కిస్తే... 8,848 మీటర్లు. అదే సముద్ర అడుగు భాగం నుంచీ చూస్తే... మౌనా కీ ఎత్తు ఏకంగా 10 వేల మీటర్లకుపైనే ఉంటుంది.
భూమి ఉపరితలంపై లోతైన ప్రాంతం... డెడ్ సీ (Dead Sea)
సముద్రాలు, సరస్సుల అడుగు భాగం కాకుండా... భూమి ఉపరితలంపై అత్యంత లోతుగా ఉండే ప్రాంతం ‘డెడ్ సీ (Dead Sea)’. డెడ్ సీ తీర ప్రాంతం... సముద్ర మట్టంతో పోలిస్తే ఏకంగా 430.5 మీటర్ల లోతున ఉండటం గమనార్హం.
భూమ్మీద మొత్తంగా లోతైన ప్రాంతం... చాలెంజర్ డీప్ (Challenger Deep)
భూమి ఉపరితలంతోపాటు సముద్రాల అడుగుభాగం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే... భూమ్మీద అత్యంత లోతైన ప్రాంతం చాలెంజర్ డీప్ (Challenger Deep). పసిఫిక్ మహా సముద్రంలోని మరియానా ట్రెంచ్ ప్రాంతంలో ఉన్న చాలెంజర్ డీప్ లోతు సుమారు 11 వేల మీటర్లు. అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టినా... ఇంకా పైన రెండున్నర వేల మీటర్ల మేర నీళ్లే ఉంటాయన్న మాట.
అత్యంత పొడిగా ఉండే ఎడారి... అటకామా (Atacama)
భూమ్మీద పెద్ద ఎడారి ఏది అనగానే సహారా అని చెబుతుంటారు. చాలా విషయాల్లో సహారా (Sahara) ఎడారి కొంత మెరుగు. కానీ చిలీలోని అటకామా (Atacama) ఎడారి అత్యంత దుర్భరమైనదని చెప్పొచ్చు. మనకు ఒక ఐదు నిమిషాల పాటు పడే వాన... ఇక్కడ ఏడాది మొత్తంలో కలిపి కూడా కురవదు మరి. అటకామా ఎడారిలోని కొన్ని వాతావరణ కేంద్రాల వద్ద సుమారు 50 ఏళ్లుగా ఒక్కసారి కూడా వర్షం పడిన దాఖలాలు నమోదుగాకపోవడం గమనార్హం.
అత్యంత ఎత్తయిన సింగిల్ జలపాతం.. ఏంజెల్ ఫాల్స్ (Angel Falls)
ప్రపంచంలో భారీ జలపాతం అనగానే నయగారా జలపాతం గుర్తుకు వస్తుంది. నీటి పరిమాణం విషయంలో నయగారానే టాప్. కానీ అత్యంత ఎత్తు నుంచి ఒకే దఫాలో కిందికి దూకే జలపాతం... ‘ఏంజెల్ ఫాల్స్ (Angel Falls)’. వెనెజువెలాలోని ఈ జలపాతం ఏకంగా 979 మీటర్ల ఎత్తు నుంచి కిందికి దూకుతుంది.
లోతైన మంచినీటి సరస్సు... బైకాల్ (Lake Baikal)
భూమ్మీద లోతైన ప్రాంతాలన్నీ కూడా సముద్రంలో ఉండేవే. అవన్నీ ఉప్పు నీళ్లు. అయితే భూమ్మీద అత్యంత లోతైన మంచినీటి ప్రాంతం.. ‘బైకాల్ సరస్సు (Lake Baikal)’. రష్యాలోని సైబీరియాలో ఉన్న బైకాల్ సరస్సు లోతు 1,642 మీటర్లు. అంతేకాదు దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సరస్సు ఎప్పుడో 2.5 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అత్యంత శీతల ప్రాంతం... అంటార్కిటికా (Antarctica)
భూమ్మీద అత్యంత శీతల ప్రాంతం అంటార్కిటికా (Antarctica). అక్కడ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ మైనస్ డిగ్రీల్లోనే ఉంటాయి. కొన్నిచోట్ల ఏకంగా మైనస్ 89 డిగ్రీల అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోవడం గమనార్హం.
అత్యంత సమతలంగా ఉండే ప్రాంతం... ‘సలార్ డి ఉయుని (Salar de Uyuni)’
భూమ్మీద ఎక్కడ చూసినా, ఏ చిన్న ప్రాంతాన్ని చూసినా ఎత్తుపల్లాలతో ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం అత్యంత సమతలంగా ఉంటాయి. అంటే ఎటు చూసినా చిన్న కొండ వంటివి కూడా కనిపించవు. అలాంటి వాటిలో అతిపెద్దది బొలీవియాలోని ‘సలార్ డి ఉయుని (Salar de Uyuni)’ సాల్ట్ ఫ్లాట్. లక్షలు, వేల ఏళ్ల కిందటి ఉప్పునీటి సరస్సులు ఎండిపోయి... ఆ నీటిలోని ఉప్పు అంతా సమతలంగా పేరుకున్న ప్రాంతాలనే సాల్ట్ ఫ్లాట్ గా పిలుస్తారు.
అతి పెద్ద అడవి అమెజాన్ (Amazon).. మరి అందులో చెట్లు ఎన్ని?
భూమ్మీద అతిపెద్ద అడవి అమెజాన్ (Amazon) అన్నది అందరికీ తెలిసిందే. మరి దాని విస్తీర్ణం ఎంతో తెలుసా?.. ఏకంగా 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఏకంగా తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉండే ఈ అడవిలో మొత్తంగా 16 వేల రకాలకు చెందిన... 40 వేల కోట్లకుపైనే చెట్లు ఉంటాయని అంచనా.