Sachin Tendulkar: సచిన్ చేయి పట్టుకుని విడవడానికి నిరాకరించిన వినోద్ కాంబ్లీ.. వీడియో ఇదిగో!

Sachin Tendulkar And Vinod Kambli Reunite At Shivaji Park Here Is Viral Video

  • గురువు రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమంలో కలుసుకున్న సచిన్, కాంబ్లీ
  • ఇద్దరూ అచ్రేకర్ శిష్యులే
  • స్కూల్ క్రికెట్‌లో ఇద్దరూ కలిసి ప్రపంచ రికార్డు 
  • భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన వినోద్ కాంబ్లీ

వినోద్ కాంబ్లీ.. నేటి తరం క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలియని ఈ పేరు.. నిన్నటి తరం అభిమానులకు సుపరిచితం. క్రికెట్ దిగ్గజం సచిన్ చిన్ననాటి స్నేహితుడి, మైదానంలో స్టైల్‌ను పరిచయం చేసిన కాంబ్లీ అప్పట్లో ఓ సెన్షేషన్. అయితే, ఆ తర్వాత ఫామ్ కోల్పోయి క్రికెట్‌కు దూరమయ్యాడు. బాల్య స్నేహితులైన కాంబ్లీ, సచిన్ ఇద్దరూ తాజాగా ఒకే వేదికపై కలుసుకున్నారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో తమ గురువు, కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌ స్మారక చిహ్నం ఆవిష్కరణలో భాగంగా వీరిద్దరి అపూర్వ కలయిక చోటుచేసుకుంది. 

సచిన్, కాంబ్లీ ఇద్దరూ అచ్రేకర్ విద్యార్థులే. స్కూల్ క్రికెట్ రోజుల్లోనే ఇద్దరూ రికార్డులు బద్దలుగొట్టారు. ఇద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నెలకొల్పి వెలుగులోకి వచ్చారు. సచిన్ ఆ తర్వాత కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ ప్రపంచ దిగ్గజ క్రికెటర్ గా పేరు సంపాదించుకోగా, కాంబ్లీ పేరు ఆ తర్వాత మసకబారింది. 

తాజాగా వైరల్ అయిన వీడియోలో కాంబ్లీని పలకరించేందుకు టెండూల్కర్ వెళ్లాడు. అనంతరం తిరిగి స్టేజిపైకి వెళ్తుండగా సచిన్ చేయి వదిలేందుకు కాంబ్లీ ఇష్టపడలేదు. ఇద్దరూ కాసేపు అలాగే చేతులు పట్టుకుని ఉండిపోయారు. అయితే, హోస్ట్ పలుమార్లు టెండూల్కర్‌ను స్టేజిపైకి ఆహ్వానించడంతో బలవంతంగా వెళ్లక తప్పలేదు. మరో వీడియోలో టెండూల్కర్‌ను కాంబ్లీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం కనిపించింది. కాగా, అచ్రేకర్ స్మారక కార్యక్రమానికి పరాస్ మాంబ్రే, ప్రవీణ్ ఆమ్రే, బల్విందర్ సింగ్ సంధు, సమీర్ దిఘే, సంజయ్ బంగర్ తదితరులు హాజరయ్యారు. వీరి కెరియర్‌ను తీర్చిదిద్దింది కూడా అచ్రేకరే. 

 వినోద్ కాంబ్లీ భారత్‌కు 17 టెస్టులు, 104 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక, కాంబ్లీ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆర్థిక ఇబ్బందులు సహా పలు కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆయనే పలుమార్లు వెల్లడించారు. బీసీసీఐ ఇచ్చే పెన్షన్‌తోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నట్టు చెప్పాడు. గత కొన్ని నెలలుగా మరింత దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఇటీవల వైరల్ అయిన వీడియోలో కాంబ్లీ నడవడానికి కూడా ఇబ్బంది పడడం కనిపించింది. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలను కాంబ్లీ ఖండించాడు. 

  • Loading...

More Telugu News