HYDRA: మరో కీలక నిర్ణయం తీసుకున్న హైడ్రా
- ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్న హైడ్రా
- వచ్చే ఏడాది నుంచి ప్రతీసోమవారం బుద్ధభవన్ లో ఫిర్యాదుల స్వీకరణ
- గడిచిన 40 ఏళ్లలో 45 శాతం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయన్న రంగనాథ్
హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ప్రజలనూ భాగస్వాములు చేయాలని, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతీ సోమవారం హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు చేయనున్నట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ సోమవారం బుద్ధభవన్ లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
గడిచిన 40 ఏళ్లలో హైదరాబాద్ లోని 45 శాతం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని రంగనాథ్ చెప్పారు. చెరువులతో పాటు వాటిలోకి నీటిని సరఫరా చేసే కాలువలు కూడా ఆక్రమించారని వివరించారు. చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ లోని పలు ఏరియాలు ముంపునకు గురవుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బయోడైవర్సిటీ లేక్ గా గుర్తింపు పొందిన అమీన్ పూర్ చెరువు కూడా కబ్జాలకు గురైందని పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు చెరువులను ఆక్రమించి నిర్మించిన 200 కట్టడాలను నేలమట్టం చేసినట్లు రంగనాథ్ వివరించారు.