Rahul Gandhi: ఢిల్లీ-యూపీ సరిహద్దు వద్ద రాహుల్‌గాంధీ, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
- హింసాత్మక ఘటనలతో అట్టుడికిన సంభాల్
- అక్కడికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
- సీనియర్ పోలీసు అధికారితో రాహుల్ మాట్లాడినా ముందుకు వెళ్లేందుకు అనుమతి నిల్
- రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి ముందుకు కదలకుండా అడ్డుకున్న పోలీసులు
- బారికేడ్ల పైకెక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సంభాల్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకను ఘజియాబాద్-ఢిల్లీ సరిహద్దులో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను అడ్డుకోవడంతో రాహుల్ వాహనం నుంచి కిందికి దిగి సీనియర్ పోలీసు అధికారితో మాట్లాడారు. అయినప్పటికీ వారు ముందుకు వెళ్లేందుకు ఆయన నిరాకరించారు.
బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు రోడ్డును బ్లాక్ చేయడంతో సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్ల పైకి ఎక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉదయం 10.15 గంటల సమయంలో ఢిల్లీలో బయలుదేరిన రాహుల్, ప్రియాంక 11 గంటలకు సరిహద్దుకు చేరుకున్నారు. ఆ తర్వాత వారి కాన్వాయ్ ముందుకు కదలలేదు. రోడ్డు బ్లాక్ చేయడంతో ఇరువైపుల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కాంగ్రెస్ నేతలు ఇటువైపు రాకుండా అడ్డుకోవాలంటూ సంభాల్ అధికారులు ఇరుగుపొరుగు జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బులంద్‌షహర్, అమ్రోహా, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలకు సంభాల్ జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. రాహుల్ గాంధీ కదలికలను దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు. మొఘలుల కాలం నాటి షాహి జమా మసీద్ సర్వే విషయంలో ఇటీవల సంభాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ స్థలంలో గతంలో హరిహర ఆలయం ఉందంటూ పిటిషన్ దాఖలైంది.