Ram Gopal Varma: 'మెగా' కంటే 'అల్లు' ఎన్నో రెట్లు మెగా: రామ్ గోపాల్ వర్మ ట్వీట్
- 'పుష్ప-2' విడుదల సందర్భంగా వర్మ సంచలన పోస్టు
- అల్లు అర్జున్ ప్లానెట్ స్టార్ అని వర్మ కితాబు
- సినీ పరిశ్రమలో ఏ స్టార్ కూడా ఇంత ఎత్తుకు ఎదగలేదన్న వర్మ
వివాదాస్పద పోస్టులు పెట్టడం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కొత్తేమీ కాదు. తాజాగా 'పుష్ప-2' సినిమా విడుదల సందర్భంగా వర్మ మరో వివాదాస్పద పోస్టు పెట్టారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ... మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని... ఆయన కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని... దీనికి మూడు కారణాలున్నాయని వర్మ తెలిపారు.
తొలి కారణం... ఇండియన్ సినిమా హిస్టరీలోనే 'పుష్ప-2' అత్యంత భారీగా విడుదల కాబోతోందని వర్మ అన్నారు. ఈ సినిమా తొలిరోజు వసూళ్లు బాక్సాఫీస్ ప్రపంచంలోని స్ట్రాటోస్పియర్ ని బ్రేక్ చేస్తాయని చెప్పారు.
రెండో కారణం... భూగ్రహంపై ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విడుదలవుతోందని వర్మ అన్నారు. అందుకే అల్లు అర్జున్ ఈ ప్రపంచంలో ఏకైక ప్లానెట్ స్టార్ అని కితాబునిచ్చారు.
మూడో కారణం... 'పుష్ప-2' చిత్రానికి అల్లు అర్జున్ 287 కోట్ల 36 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నారని... ఇది మెగా మెగా కంటే మెగా రెట్లు ఎక్కువని వర్మ చెప్పారు. సినీ చరిత్రలో ఏ స్టార్ కూడా ఇంత ఎత్తుకు ఎదగలేదని... అందుకే అల్లు అర్జున్ నిజమైన టవర్ స్టార్ అని కొనియాడారు.