Jagan: ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదు: జగన్

There is lot of a anti on government says Jagan

  • సూపర్ సిక్స్ లేదు.. సెవెన్ లేదని జగన్ ఎద్దేవా
  • రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని విమర్శ
  • ప్రజల తరపున గళం విప్పాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్య

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల వ్యవధిలోనే ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. సూపర్ సిక్స్ లేదు, సెవెన్ లేదని... కూటమి నేతలను ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని అన్నారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని జగన్ అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ లో ఉందని... జనవరి వస్తే రూ. 2,800 కోట్లు పెండింగ్ అవుతుందని చెప్పారు. వసతి దీవెనకు రూ. 1,100 కోట్లు పెండింగ్ లో ఉందని అన్నారు. తొమ్మిది నెలలుగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయని చెప్పారు. నాలుగు నెలలుగా 104, 108 ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని అన్నారు. 

కరెంటు ఛార్జీలను బాదే పనులు మొదలయ్యాయని విమర్శించారు. వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న రేటు కంటే డబుల్ రేట్ కి ఇసుక అమ్ముతున్నారని అన్నారు. 

మద్యం షాపులను చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఒక్కో బెల్టు షాపుకు రూ. 2 నుంచి 3 లక్షలకు వేలం పాట పెడుతున్నారని చెప్పారు. ప్రజల తరపున గళం విప్పాల్సిన సమయం వచ్చిందని... జిల్లాల అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.

  • Loading...

More Telugu News