KTR: రేవంత్ రెడ్డీ! నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి సరైన స్థానంలో ఉంటుంది: కేటీఆర్
- రాజీవ్ విగ్రహం పెట్టిన చోటే తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుందని వ్యాఖ్య
- కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదన్న కేటీఆర్
- ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భారతమాత రూపాన్ని వాజ్ పేయి మార్చలేదన్న కేటీఆర్
రేవంత్ రెడ్డీ! నువ్వెన్ని కథలు పడ్డా నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి సరైన స్థానంలో ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడైతే పెట్టారో... అక్కడ తెలంగాణ తల్లి కచ్చితంగా నిటారుగా నిలబడుతుందన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారన్నారు.
కానీ కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భారతమాత రూపాన్ని వాజ్ పేయి అధికారంలోకి వచ్చాక మార్చలేదన్నారు. దేశంలో ఎన్నోచోట్ల అధికార మార్పిడి జరిపినప్పటికీ ఆయా రాష్ట్రాల విగ్రహాల రూపును మార్చలేదన్నారు.
తెలంగాణ తల్లి రూపును మాపే ప్రయత్నం ఇకనైనా మానుకోవాలన్నారు. అధికారం ఉందని పోలీసు బలగాల మధ్య మీ నాటకాలు కొంతకాలం మాత్రమే సాగుతాయని... కానీ ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. అంబేద్కర్ సచివాలయం గురించి, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ గురించి మాత్రం మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని 2007 ఉద్యమ కాలంలో రూపొందించినట్లు చెప్పారు.