YS Sharmila: అదానీ ఇచ్చిన రూ.1,750 కోట్ల ముడుపులపై జగన్ తెలివిగా మాట్లాడుతున్నారు!: షర్మిల

Sharmila blames ys jagan in Adani MOU

  • అమెరికా సంస్థ తన పేరు చెప్పిందా? అని జగన్ మాట్లాడటం విడ్డూరమన్న షర్మిల
  • 2021లో నాటి సీఎం అంటే.. జగన్ కాక మరెవరని ప్రశ్న
  • టీడీపీ ప్రభుత్వం ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్న
  • చంద్రబాబుకు ఏమైనా డబ్బులు అందాయా? అని నిలదీత

అదానీ నుంచి ముడుపులు అందుకున్నట్లు తన పేరు ఎక్కడైనా ఉందా? అని జగన్ తెలివిగా మాట్లాడుతున్నారని, కానీ 2021లో నాటి సీఎం అంటే జగన్ కాక మరెవరు? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ... అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో వైఎస్ జగన్ రూ.1,750 కోట్ల మేర ముడుపులు అందుకున్నట్లు అమెరికా దర్యాఫ్తు సంస్థ చెబుతోందన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కూడా అదానీ డీల్ పెద్ద కుంభకోణమని ఆందోళన చేసిందని, పెద్ద ఎత్తున ముడుపులు అందాయని పయ్యావుల కేశవ్ కూడా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అదానీ ఇచ్చిన ముడుపులపై టీడీపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని నిలదీశారు.

చంద్రబాబుకు ఏమైనా డబ్బులు అందాయా?

అదానీకి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారా? ఒప్పందం రద్దులో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? లాంగ్ టర్మ్ డీల్ చేయకూడదని తెలిసినా జగన్ ఎందుకు అమలు చేశారు? జగన్-అదానీ మధ్య ఒప్పందం ఎందుకు రద్దు చేయరు? చంద్రబాబు‌కు కూడా ఏమైనా డబ్బులు అందాయా? చంద్రబాబు ఒప్పందాలను జగన్ చాలా తేలిగ్గా రద్దు చేశారు. జగన్ ఒప్పందాలను చంద్రబాబు ఎందుకు రద్దు చేయడం లేదు? ఈ నెల నుంచే విద్యుత్ భారాలు ప్రజలపై మోపారు. అక్రమాలన్నీ స్పష్టంగా తెలిసినా చంద్రబాబు స్పందించరా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ ఒప్పందాలు రద్దు చేయాలని చంద్రబాబుని‌ డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని అదానీ, జగన్ మధ్య ఒప్పందాలు రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఈఆర్సీకి (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ) లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాలపై పునఃపరిశీలన చేయాలని ఆ లేఖలో కోరుతున్నామన్నారు.
 

  • Loading...

More Telugu News