Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ ప్రతినిధులు భేటీ
- జీఎస్ఈసీ ఏర్పాటు నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపిన సీఎం
- ఐటీ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్న రేవంత్ రెడ్డి
- జీఎస్ఈసీ సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ సీఐవో రాయల్ హన్సెన్, అరిజిత్ సర్కార్, శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. ఐటీ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సైబర్ సమస్యలపై హైదరాబాద్ కేంద్రంగా పరిష్కారం లభిస్తుందన్నారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, మెటా సంస్థలు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ వల్ల హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.