Syed Mushtaq Ali Trophy: టీ20లో సంచలనం... వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన బరోడా!
- సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సిక్కిం, బరోడా మ్యాచ్
- నిర్ణీత 20 ఓవర్లలో 349/5 పరుగులు చేసిన బరోడా
- ప్రపంచ టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్
- అలాగే బరోడా ఇన్నింగ్స్ లో 37 సిక్సులు
- దీంతో బరోడా పేరిట మరో ప్రపంచ రికార్డు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో సంచలనం నమోదైంది. ఇండోర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్లో బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 349/5 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. ఈ సందర్భంగా అక్టోబర్లో గాంబియాపై జింబాబ్వే 344/4 రికార్డును బరోడా బ్రేక్ చేసింది. అలాగే మరో ప్రపంచ రికార్డును కూడా తన పేరున లిఖించుకుంది. బరోడా తన ఇన్నింగ్స్ లో మొత్తం 37 సిక్సులు కొట్టింది. ఇంతకుముందు ఈ రికార్డు జింబాబ్వే (27) పేరిట ఉండేది.
ఇక బరోడా బ్యాటర్లలో భాను పూనియా కేవలం 51 బంతుల్లోనే 134 పరుగులతో ఊచకోత కోశాడు. అతడి ఇన్నింగ్స్ లో 15 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. 42 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. ఇందులో మొదటి అర్ధ శతకం 20 బంతుల్లోనే వస్తే, రెండోది 22 బంతుల్లో వచ్చింది. అలాగే శివాలిక్ శర్మ (17 బంతుల్లో 55), అభిమన్యు సింగ్ (53), సోలంకి (16 బంతుల్లో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు.