Harish Rao: హరీశ్ రావును అరెస్టు చేయొద్దు... తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Ex Minister Harish Rao Gets Relief In Telangana High Court

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రికి స్వల్ప ఊరట
  • చక్రధర్ గౌడ్ కు నోటీసులు పంపిన హైకోర్టు
  • హరీశ్ రావు క్వాష్ పిటిషన్ పై విచారణ

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు హరీశ్ రావుపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు గురువారం నాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో, కేసు దర్యాఫ్తులో పోలీసులకు సహకరించాలని హరీశ్ రావుకు సూచించింది. ఈ వ్యవహారానికి సంబంధించి చక్రధర్ గౌడ్ కు నోటీసులు జారీ చేసింది.

పంజాగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన కేసు రాజకీయ కక్షలో భాగమని ఆరోపిస్తూ హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు కథనాల ఆధారంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆయన అభ్యర్థించారు. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడో జరిగిపోయిన వ్యవహారమని గుర్తుచేస్తూ, చక్రధర్ గౌడ్ ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడం వెనక రాజకీయ కక్ష సాధింపు కోణం ఉందని వాదించారు. ఫిర్యాదులోని అంశాలపై కనీసం ప్రాథమిక విచారణ కూడా జరపకుండా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. 

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరెస్టు చేస్తే తన రాజకీయ జీవితం, వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటాయని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ పై ఫిర్యాదు జరిపిన హైకోర్టు... తాజాగా హరీశ్ రావుకు ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది.

  • Loading...

More Telugu News