Nitin Gadkari: ప్రజలకు చట్టాలంటే భయం లేదు... వారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు: నితిన్ గడ్కరీ

Nitin Gadkari in Lok Sabha on deaths in road accidents

  • రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన
  • తానూ రోడ్డు ప్రమాద బాధితుడేనని వ్యాఖ్య
  • ప్రజల సహకారం లేకుండా రోడ్డు ప్రమాదాలు తగ్గించలేమన్న కేంద్రమంత్రి

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ప్రజల నిర్లక్ష్యం వల్ల బాధితుల సంఖ్య ఏటికేడు పెరుగుతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలంటే ప్రజలకు భయం లేకుండా పోయిందన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తానూ రోడ్డు ప్రమాద బాధితుడినే అని తెలిపారు.

పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లోక్ సభలో సమాధానం ఇచ్చారు. దేశంలో ఏడాది కాలంలో 1.68 లక్షల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని... ఇందులో 60 శాతం మంది యువకులే ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగినట్లు చెప్పారు. అందుకే ఈ అంశం తనకు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. 

ప్రజాప్రతినిధులు, మీడియా, ప్రజల సహకారం లేకుండా రోడ్డు ప్రమాదాలు తగ్గించడం సాధ్యం కాదన్నారు. జరిమానాలు ఎంత పెంచినా ప్రజలు నిబంధనలు పాటించడం లేదని వాపోయారు. రోడ్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, సమర్థవంతంగా చట్టాల అమలు, ప్రజలకు అవగాహన... ఈ నాలుగు ముఖ్యమైన అంశాలన్నారు. చాలామంది రెడ్ సిగ్నల్ పడితే ఆగరు... హెల్మెట్ పెట్టుకోరని వాపోయారు. నిన్న తన కళ్లముందే ఓ కారు రెడ్ సిగ్నల్‌ను క్రాస్ చేసిందన్నారు.

  • Loading...

More Telugu News