Champions Trophy 2025: దిగొచ్చిన పీసీబీ.. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లోనే..కానీ..!

Champions Trophy Hybrid Model Finalised Says Report

  • పీసీబీ స‌హా వివిధ దేశాల క్రికెట్ బోర్డుల‌తో ఐసీసీ కొత్త అధ్యక్షుడు జైషా గురువారం అన‌ధికార స‌మావేశం
  • హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పీసీబీ అంగీక‌రించిన‌ట్లు ఐసీసీ వర్గాల స‌మాచారం 
  • అయితే, 2027 వరకు భార‌త్‌, పాక్‌లో జ‌రిగే అన్ని టోర్నీలు హైబ్రిడ్ విధానంలోనే

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విష‌యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దిగొచ్చిన‌ట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు అంగీక‌రించిన‌ట్లు ఐసీసీ వర్గాల స‌మాచారం. అయితే, 2027 వరకు భార‌త్‌, పాక్‌లో జ‌రిగే అన్ని టోర్నీలు హైబ్రిడ్ విధానంలో జ‌రుగుతాయి. 

ఇక ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా త‌న మ్యాచ్‌ల‌ను దుబాయిలో ఆడటానికి కూడా మార్గం సుగ‌మ‌మైన‌ట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌తో సహా వివిధ దేశాల క్రికెట్ బోర్డు డైరెక్టర్లతో ఐసీసీ కొత్త అధ్యక్షుడు జైషా గురువారం దుబాయిలోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిపిన‌ అనధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం. 

"2025 ఛాంపియన్స్ ట్రోఫీని యూఏఈ, పాకిస్థాన్‌లో భారత్‌తో కలిసి ఆడాలని హైబ్రిడ్ మోడ‌ల్‌లో అన్నిబోర్డులు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఇది అంద‌రి విజయం. మంచి నిర్ణ‌యం" అని ఐసీసీ వ‌ర్గాలు పీటీఐకి తెలిపాయి.

ఇక వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి-మార్చిలో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌రగ‌నుంది. దీనికోసం మొద‌ట పీసీబీ తాము హైబ్రిడ్ మోడ‌ల్‌ను అంగీక‌రించ‌బోమ‌ని, కావాలంటే బాయ్‌కాట్ చేసేందుకు కూడా రెడీ అని బెదిరించింది. అయితే, గ‌తవారం జ‌రిగిన స‌మావేశంలో మెట్టుదిగిన పాక్ బోర్డు హైబ్రిడ్ మోడ‌ల్‌కు అంగీక‌రించింది. 

కానీ, 2031 వ‌ర‌కు భార‌త్‌, పాక్‌లో జ‌రిగే ఐసీసీ టోర్నీల‌న్నింటినీ ఇదే విధానంలో జ‌ర‌పాల‌ని డిమాండ్ చేసింది. అలా అయితే తాము హైబ్రిడ్ మోడ‌ల్‌కు అంగీక‌రిస్తామ‌ని పేర్కొంది. ఇక తాజా స‌మావేశంలో ఐసీసీ 2027 వరకు భార‌త్‌, పాక్‌లో జ‌రిగే అన్ని టోర్నీలను హైబ్రిడ్ విధానంలో నిర్వ‌హించేందుకు ఒప్పుకుంది. దీనికి పీసీబీ కూడా ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

కాగా, ఈ టైమ్ పీరియ‌డ్‌లో భార‌త్ వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్‌లో మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, 2026లో పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు ఐసీసీ టోర్నీల‌ను హైబ్రిడ్ మోడ‌ల్‌లో భాగంగా శ్రీలంక‌తో క‌లిసి భార‌త్ నిర్వ‌హించ‌నుంది. 

"2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్థాన్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ కోసం పీసీబీ డిమాండ్ చేసిన పరిహారం ఇంకా పరిశీలనలో ఉంది" అని ఐసీసీ వ‌ర్గాలు తెలిపాయి. 

ఇక భ‌ద్రతా కార‌ణాల దృష్ట్యా భార‌త్ 2008 నుంచి పాక్‌లో ప‌ర్య‌టించ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఏడాది జ‌రిగే ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం త‌మ జ‌ట్టును పాకిస్థాన్‌కు పంపించ‌బోమ‌ని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. అటు పాక్ మాత్రం టీమిండియా త‌మ దేశానికి రావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింది. కానీ, చివ‌రికి మెట్టుదిగొచ్చి ఇప్పుడు హైబ్రిడ్ మోడల్‌ను అంగీక‌రించాల్సి వ‌చ్చింది. దీంతో ఇన్ని రోజులు ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌పై నెలకొన్న సందిగ్ధ‌త‌కు ఫుల్‌స్టాప్ పడిన‌ట్లైంది. 

  • Loading...

More Telugu News