Cold-Cough-Sore Throat: జలుబు, దగ్గు, గొంతునొప్పా... అయితే ఈ ఏడు చిట్కాలు ట్రై చేయండి!

Seven remedies to tackel cold and cough

  • చలికాలంలో అనారోగ్య సమస్యల ఉద్ధృతి
  • చాలామందిలో కామన్ గా జలుబు
  • ఇంట్లో దొరికే వాటితో జలుబుకు చెక్

చలికాలం వస్తే చాలు... అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. వాతావరణం అతి చల్లగా ఉంటే వైరస్ లు, బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా, శీతాకాలం వస్తే జలుబు కామన్ గా కనిపిస్తుంటుంది. జలుబుతో పాటే దగ్గు, గొంతునొప్పి కూడా వేధిస్తుంటాయి. ఆయా అనారోగ్య లక్షణాలకు ఔషధాలు ఉన్నప్పటికీ, అంతవరకు వెళ్లకుండా... మన ఇంట్లోనే లభించే వాటితో నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆ ఏడు చిట్కాలు ఏంటో ఓసారి చూద్దాం...

1. అల్లం
అల్లం యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రభావం చూపిస్తుంది. దగ్గును కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తాజా అల్లం ముక్కలను తేనెతో కలిపి తీసుకోవాలి. లేదా... అల్లం ముక్కలు, తేనె కలిపిన టీ తాగడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
2. తేనె
దగ్గును తగ్గించడంలో తేనె సమర్థవంతంగా పనిచేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పెద్దవాళ్లు, పిల్లలు ఎవరైనా తేనెను వాడొచ్చు. దగ్గుతో బాధపడుతున్నప్పుడు తేనెను ఎలా తీసుకోవాలంటే... ఒక టేబుల్ స్పూన్ తేనెకు కొన్ని చుక్కలు అల్లం రసం కలిపి తీసుకోవాలి. అంతేకాదు, తేనెను వేడి వేడి లెమన్ టీ, లేక గ్రీన్ టీతో కలిపి కూడా తీసుకోవచ్చు.
3. విటమిన్ సి
విటమిన్ సి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంపొందించడంలో విటమిన్ సి కీలకం. సీజనల్ గా వచ్చే అనారోగ్య సమస్యలను నివారించడంలో విటమిన్ సి తోడ్పడుతుంది. నిమ్మ, బత్తాయి, కమలా వంటి సిట్రస్ జాతి ఫలాలను తీసుకోవడం ద్వారా విటమిన్ సి పొందవచ్చు.
4. పసుపు
మనం పసుపును నిత్యం కూరల్లో ఉపయోగిస్తుంటాం. చలికాలంలో దీని ఉపయోగం అంతా ఇంతా కాదు. పసుపు శరీరంలో వేడిని కలిగిస్తుంది. జలుబు, దగ్గు లక్షణాలను తగ్గించడంలో పసుపు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాలు ఉంటాయి. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
5. ఉప్పునీటిని పుక్కిలించడం, ఆవిరి పట్టడం
జలుబు చేసినప్పుడు ముక్కులు పట్టేయడం, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటాం. ఈ సమస్యను... ఉప్పునీటిని పుక్కిలించడం ద్వారా తొలగించుకోవచ్చు. అంతేకాదు, ఉప్పు నీటిని పుక్కిలించడం వల్ల గొంతునొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక, చలికాలంలో చాలామందికి ఛాతీలో ఆయాసంగా ఉంటుంది. ఇలాంటివారు ఆవిరిపట్టడం వల్ల ప్రయోజనం కనిపిస్తుంది. ఆవిరి పట్టడం వల్ల వాయునాళాలకు అవసరమైన తేమ లభిస్తుంది.
6. సూప్ లు
వేడి వేడి సూప్ లు తాగడం వల్ల జలుబు తీవ్రత తగ్గడమే కాదు, త్వరగా కోలుకోవచ్చు. సూప్ లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వేడి లభ్యం అవుతుంది. అంతేకాదు, శరీరానికి అవసరమైన కీలక పోషకాలు సూప్ ల ద్వారా అందుతాయి. ఇమ్యూనిటీ వ్యవస్థ బలోపేతం అవుతుంది.
7. హాట్ డ్రింక్స్
చలికాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది టీలతో గడిపేస్తుంటారు. టీలు మాత్రమే కాకుండా, మిరియాల కషాయం వంటి ఇతర హాట్ డ్రింక్స్ కూడా జలుబును కట్టడి చేయడంలో సహాయకారిగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా కాపాడతాయి.

  • Loading...

More Telugu News