G. Kishan Reddy: తెలంగాణలో ఆర్థిక సంక్షోభం రాబోతుందంటూ కేంద్రమంత్రి హెచ్చరిక
- కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కిషన్ రెడ్డి మండిపాటు
- ప్రస్తుత పరిస్థితుల్లో హామీలను అమలు చేసే పరిస్థితి కూడా లేదన్న కేంద్రమంత్రి
- ఉద్యోగులకు కనీసం వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని వ్యాఖ్య
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో ఆర్థిక సంక్షోభం నెలకొనే ప్రమాదం పొంచి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది అవుతున్నా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ఏడాది పాలన ప్రజావ్యతిరేక పాలన అని, దీనిని నిరసిస్తూ 6 అబద్ధాలు, 66 మోసాలు పేరుతో బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హామీలు అమలు చేసే పరిస్థితి కూడా లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ, మహిళలకు తులం బంగారం, నిరుద్యోగ భృతి తదితర ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు కనీసం వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థికస్థితి ఉందన్నారు.