Crime News: తన భార్యతో మాట్లాడుతున్న ప్రియుడిపై భర్త రాళ్ల దాడి
- అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఘటన
- వివాహితకు ఫోన్ చేసి ఆసుపత్రి వద్దకు పిలిపించుకున్న ప్రియుడు
- ఆపై ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా చూసి స్నేహితులతో కలిసి భర్త దాడి
ప్రియుడితో ఏకాంతంగా మాట్లాడుతున్న భార్యను చూసిన భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. స్నేహితులతో కలిసి వారిని చితక్కొట్టాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గత రాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఇంద్ర (20) అనే యువకుడు ఓ వివాహితకు ఫోన్ చేసి స్థానిక ఆసుపత్రి వద్దకు రమ్మని పిలిచాడు. ఆమె వచ్చాక ఇద్దరూ కలిసి ఆసుపత్రి ఆవరణలోని చెట్టుకింద కూర్చుని మాట్లాడుకుంటుండగా ఆమె భర్త, స్నేహితులు అక్కడికి చేరుకుని రాళ్లతో దాడిచేశారు. ఆపై పట్టుకుని చితకబాదారు.
ఈ గొడవను చూసి ఆసుపత్రి భద్రతా సిబ్బంది, స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఇంద్ర నుంచి వివరాలు సేకరించారు. రాళ్ల దాడిలో గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా యువకుడితో తన భార్య చనువుగా ఉంటోందని, యువకుడు తన భార్యకు మెసేజ్లు పంపుతున్నాడని వివాహిత భర్త ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.