Harish Rao: రేవంత్ ఏడాది పాలనపై చార్జిషీట్ విడుదల చేసిన హరీశ్ రావు
- తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి
- విజయోత్సవాలు చేసుకుంటున్న కాంగ్రెస్
- చార్జిషీట్లు విడుదల చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ
- నేడు చార్జిషీట్ విడుదల చేసి ప్రభుత్వాన్ని ఏకిపారేసిన హరీశ్ రావు
తమ ఏడాది పాలనపై ఓవైపు అధికార కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటుంటే విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ చార్జిషీట్లు విడుదల చేస్తున్నాయి. తాజాగా, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు కూడా రేవంత్ ఏడాది పాలనపై చార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రేవంత్ పాలన రైతుల సంక్షేమానికి రాహుకాలం అని, వ్యవసాయానికి గ్రహణం అని అభివర్ణించారు. అధికారంలోకి రాగానే రుణమాఫీపై మొదటి సంతకం పెడతానని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక హామీని నిలుపుకోలేదని ఆరోపించారు. కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టి నాలుగు కోట్ల ప్రజలను మోసం చేయగలిగినోడికి... మూడు కోట్ల దేవతలను మోసం చేయడం పెద్ద విషయమా? అని హరీశ్ రావు విమర్శించారు.
"బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎంత ధాన్యం పండిందన్నది దాచినా దాగని సత్యం. 2014-15లో 68 లక్షల టన్నుల వరి పండితే... 2023-24లో 1.68 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండింది. 2014-15లో 1.31 కోట్ల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం... 2023-24 నాటికి 2.22 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైందో రేవంత్ రెడ్డి చెప్పాలి" అని నిలదీశారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో రోడ్డెక్కని రంగం అంటూ లేదని, విద్యార్థుల నుంచి అవ్వా తాత వరకు అన్ని వర్గాల వారిని రోడ్ల మీదికి తెచ్చిన గొప్పదనం రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లి అక్కడ కూడా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడని, ఆయన మాట్లాడిన భాషకు అర్థం ఏమిటో ఆ దేవుడికే తెలియాలని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
రేవంత్ ఊసరవెల్లిలా రంగులు మార్చుతాడని, లగచర్ల రైతుల దెబ్బకు భయపడి ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అని మాటమార్చుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఉపాధి కల్పనపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే... కేటీఆర్ చెప్పినట్టు కల్వకుర్తిలో ఆయనకున్న 500 ఎకరాలను ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.