Mohammed Siraj: సిరాజ్-హెడ్ వ్యవహారంపై ఐసీసీ సీరియస్!
- జరిమానా విధించేందుకు సిద్ధమైన ఐసీసీ
- ఇద్దరినీ దోషులుగా తేల్చినట్టు సమాచారం
- విచారణ తర్వాత ప్రకటన వెలువడే ఛాన్స్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఆట రెండవ రోజున భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ ఆగ్రహంతో ‘సెండ్ ఆఫ్’ ఇచ్చాడు. బయటకు వెళ్లిపో అన్నట్టు చేతులతో సంజ్ఞలు చేశాడు. హెడ్ కూడా తిరిగి స్పందించడంతో ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు.
అయితే విషయాన్ని బయటకు వెల్లడించేటప్పుడు మాత్రం ఇద్దరూ ఎవరికి వారే అనుకూలంగా చెప్పారు. దీంతో ఇద్దరి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఐసీసీ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరికీ జరిమానా విధించేందుకు సిద్దమతున్నట్టు ‘ది డైలీ టెలిగ్రాఫ్’ కథనం పేర్కొంది.
అడిలైడ్ మైదానంలో జరిగిన ఈ ఘర్షణ విషయంలో ఎవరినీ సస్పెండ్ చేసే అవకాశం లేదని, జరిమానా వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఐసీసీ ఇద్దరినీ దోషులుగా నిర్ధారించిందని, క్రమశిక్షణా విచారణ తర్వాత జరిమానా ప్రకటన వెలువడవచ్చని పేర్కొంది.