Chennamaneni Ramesh: చెన్నమనేని రమేశ్ కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
- జర్మనీ పౌరుడుగానే ఎమ్మెల్యేగా గెలిచారన్న కోర్టు
- పదిహేనేళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారని మండిపాటు
- రూ.30 లక్షలు జరిమానా విధించి నెల రోజుల్లోపు చెల్లించాలని ఆదేశం
బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన జర్మనీ పౌరుడేనని తేల్చింది. జర్మన్ పౌరుడిగా కొనసాగుతూనే తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొంది. తప్పుడు పత్రాలతో పదిహేనేళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారంటూ చెన్నమనేనిపై మండిపడింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. కోర్టును, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు 30 లక్షలు జరిమానా విధించింది. అందులో రూ.25 లక్షలు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కు, మిగతా 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి నెల రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది.
చెన్నమనేని రమేశ్ బాబు జర్మన్ పౌరుడని, ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ తరఫున వేములవాడ నియోజకవర్గం నుంచి రమేశ్ బాబు అసెంబ్లీకి పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో రమేశ్ బాబు గెలుపొందారు. దీనిపై ఆది శ్రీనివాస్ కోర్టుకెక్కారు. రమేశ్ బాబు దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుల తడక అని, రమేశ్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉందని ఆరోపించారు. ఈ కారణంగా రమేశ్ బాబు ఎన్నిక చెల్లదని వాదించారు. ఈ కేసు విచారణలో ఉండగానే 2018 లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగగా రమేశ్ బాబు వేములవాడ నుంచి మళ్లీ గెలుపొందారు. తాజాగా ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.