Palla Rajeshwar Reddy: మహిళా లోకమంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతుంది: పల్లా రాజేశ్వర్ రెడ్డి
- తెలంగాణ తల్లుల వంటి ఆశా వర్కర్లను అరెస్ట్ చేయిస్తున్నారని పల్లా మండిపాటు
- అన్ని విషయాల్లో ప్రభుత్వం విఫలమయిందని విమర్శ
- కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్య
ఓవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మరోవైపు, తెలంగాణ తల్లుల వంటి ఆశా వర్కర్లను అరెస్ట్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రూ. 18 వేలు జీతం ఇవ్వాలని ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపిందని విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ పెద్దలు చేపట్టిన పనులకు రూ. వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారని... చిన్నచిన్న పనులు చేసిన సర్పంచ్ లకు మాత్రం బిల్లులు చెల్లించడం లేదని రాజేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల మంది సర్పంచ్ లు ఆందోళన చేస్తున్నారని, వారి గోడును పట్టించుకునే వారే లేరని అన్నారు. అన్ని విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని దుయ్యబట్టారు.
గ్రామాల్లో స్ట్రీట్ లైట్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. మహిళా లోకమంతా ఏకమై కాంగ్రెస్ ను గద్దె దించుతుందని చెప్పారు.