Telangana: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 'టీఎస్'ను 'టీజీ'గా మార్చాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy reveals why TG ranamed

  • ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్న సీఎం
  • ఉద్యమం రోజుల్లో 'టీజీ' అని రాసుకున్నామని వెల్లడి
  • రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తున్నామన్న రేవంత్ రెడ్డి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము 'టీఎస్'ను 'టీజీ'గా మార్చామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఎన్నో ఏళ్ళు అవహేళనకు గురైందన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న రోజుల్లో అందరూ 'టీజీ' అని రాసుకున్నారని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం 'టీఎస్' అని తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతిచోట 'జయ జయహే తెలంగాణ' వినిపించేదని, కానీ రాష్ట్రం వచ్చాక ఆ గేయానికి గౌరవం దక్కలేదని విమర్శించారు. అందుకే తాము ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు. తెలంగాణ పదేళ్ల పాటు వివక్షకు గురైందన్నారు. ఎందరో కవులు, కళాకారులు ఉద్యమానికి ఊపిరిలూదారని, వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని తాము సంక్షేమం వైపు నడిపిస్తున్నామన్నారు.

డిసెంబర్ 9కి ప్రత్యేకత ఉంది: భట్టివిక్రమార్క

తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్రం నుంచి తొలి ప్రకటన వచ్చింది డిసెంబర్ 9వ తేదీనే అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నట్లు చెప్పారు. కానీ తెలంగాణ వచ్చాక గత పదేళ్లు ఆంక్షలు నెరవేరలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లు ప్రజలు నిర్బంధాల మధ్య గడిపారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News