Students Missing: లక్కీ భాస్కర్ సినిమా చూసి నలుగురు విద్యార్థుల అదృశ్యం
- విశాఖలో ఘటన
- లక్కీభాస్కర్ హీరోలా ఇల్లు, కార్లు సంపాదిస్తామన్న విద్యార్థులు
- ఫ్రెండ్స్ కు చెప్పి హాస్టల్ నుంచి పరారీ
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
విశాఖలో విస్మయం కలిగించే ఘటన చోటుచేసుకుంది. లక్కీభాస్కర్ సినిమా చూసిన నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఆ నలుగురు విద్యార్థులు విశాఖలోని మహారాణిపేటలో ఓ హాస్టల్ నుంచి పరారయ్యారు.
లక్కీభాస్కర్ సినిమాలో హీరో లాగా ఇల్లు, కార్లు సంపాదించి తిరిగొస్తామని ఫ్రెండ్స్ కు చెప్పిన ఆ విద్యార్థులు హాస్టల్ వదిలి వెళ్లిపోయారు. పరారైన విద్యార్థులను కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘు అని గుర్తించారు. వీరు సెయింట్స్ ఆన్స్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు.
కాగా, విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థుల ఎటు వెళ్లారో తెలుసుకునేందుకు రైల్వే స్టేషన్, బస్టాండ్ లోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు.