Well Marked Low Pressure: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... అప్ డేట్ ఇదిగో!
- మరింత బలపడిన అల్పపీడనం
- పశ్చిమ వాయవ్య దిశగా పయనం
- రేపు, ఎల్లుండి ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ... శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరువగా వస్తుందని వివరించింది.
ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రేపు (డిసెంబరు 11) నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని... ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
ఎల్లుండి (డిసెంబరు 12) నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని... ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.