Mohan Babu: మోహన్ బాబుపై జర్నలిస్టు సంఘాల ఫైర్

tuwj demanded for file attempt to murder case on mohan babu
  • మోహన్ బాబు నివాసం వద్ద ఆందోళన నిర్వహించిన జర్నలిస్టులు 
  • మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాల నేతలు
  • మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్
మీడియా ప్రతినిధులపై నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. కాగా, జర్నలిస్టులపై దాడి ఘటనను టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ ఆలీ తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబు రౌడీ షీటర్ మాదిరిగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. 

మీడియా స్వేచ్చకు భంగం కలిగించడం సరికాదని ఆయన హితవు పలికారు. మోహన్‌ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టీయూడబ్ల్యుజే జనరల్ సెక్రటరీ మారుతీ సాగర్ డిమాండ్ చేశారు. మోహన్ బాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీ, తెలంగాణ వీడియో జర్నలిస్టు అసోసియేషన్ కూడా మోహన్ బాబు చర్యలను ఖండించింది.  
 
అసలు ఏమి జరిగిందంటే.. మంగళవారం రాత్రి తన భార్య భూమా మౌనికతో కలిసి మంచు మనోజ్ జల్‌పల్లిలోని నివాసానికి చేరుకోగా, అక్కడ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ గేట్లు వేసేశారు. తన ఏడు నెలల పాప లోపలే ఉందని, గేట్లు తీయాలని వారితో మంచు మనోజ్ వాగ్వివాదానికి దిగాడు. అయినా సెక్యూరిటీ సిబ్బంది గేటు తీయలేదు. 

దీంతో ఆగ్రహానికి గురైన మనోజ్ ప్రైవేటు బౌన్సర్‌ల సాయంతో గేటు తోసుకుంటూ లోపలకు వెళ్లాడు. అనంతరం కొద్దిసేపటికి చిరిగిన చొక్కా, దెబ్బలతో మనోజ్ బయటకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడ వివాదాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఆవేశంతో రెచ్చపోవడమే కాక ఒక జర్నలిస్ట్ చేతిలో ఉన్న లోగోను లాక్కొని వారిపై దాడికి దిగారు. మరో పక్క మీడియా ప్రతినిధుల ఫోన్‌లను బౌన్సర్‌లు లాక్కున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  
Mohan Babu
Manchu Manoj
Hyderabad

More Telugu News