Chinmoy Krishnadas: చిన్మయ్ కృష్ణదాస్ కు కొనసాగుతున్న కష్టాలు... బెయిల్ నిరాకరించిన బంగ్లాదేశ్ కోర్టు
- బంగ్లాదేశ్ లో అరెస్టయిన ఇస్కాన్ ఆధ్యాత్మిక గురువు
- కేసు వాదించడానికి న్యాయవాదులు లేని వైనం
- ఇటీవల కొందరు న్యాయవాదులపై తీవ్రస్థాయిలో దాడులు
- ఓ న్యాయవాది సిద్ధంగా ఉన్నా... పవర్ ఆఫ్ అటార్నీ లేదన్న కోర్టు
ఇస్కాన్ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్ లో అరెస్ట్ కావడం తెలిసిందే. దేశ ద్రోహం ఆరోపణలతో అక్కడి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, బంగ్లాదేశ్ కోర్టులో ఆయనకు మరోసారి నిరాశ ఎదురైంది.
కాగా, కొన్ని విచారణలకు చిన్మయ్ కృష్ణదాస్ తరఫున న్యాయవాదులెవరూ లేకపోవడం ప్రతికూలంగా మారింది. తాజాగా, చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించేందుకు సుభాశీష్ అనే న్యాయవాది సిద్ధంగా ఉన్నా... ఆయనకు పవర్ ఆఫ్ అటార్నీ లేదంటూ చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది.
ఇటీవల చిన్మయ్ కృష్ణదాస్ తరఫున రవీంద్ర ఘోష్ అనే న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన ఈ కేసు వాదించడానికి వస్తే, ఢాకా ప్రజలు అతడిని కోర్టులోకి వెళ్లేందుకు అనుమతించలేదు. దాంతో ఆయన తన తరఫున ప్రతినిధిగా సుభాశీష్ ను విచారణకు పంపించారు.
కానీ, తన తరఫున కోర్టులో హాజరయ్యేందుకు సుభాశీష్ కు రవీంద్ర ఘోష్ ఎలాంటి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వలేదని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేశారు.
ఇటీవల చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించడానికి వచ్చిన న్యాయవాదులపై కొందరు దారుణంగా దాడి చేసి గాయపర్చిన సంగతి తెలిసిందే.