Mohan Babu: మోహన్ బాబు ఫ్యామిలీ గొడవపై పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పందన
- మోహన్ బాబు నివాసంలో జరిగింది వాళ్ల వ్యక్తిగతమన్న సుధీర్ బాబు
- వాళ్ల వల్ల పబ్లిక్ డిస్టర్బ్ కాకూడదని వ్యాఖ్య
- ఇంటి పరిసరాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఉండకూడదన్న సీపీ
సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ విషయంలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు నివాసంలో జరిగింది వాళ్ల వ్యక్తిగతమని... అయితే వాళ్ల వల్ల పబ్లిక్ డిస్టర్బ్ కాకూడదని చెప్పారు. జల్ పల్లిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నందువల్లే ముగ్గురికీ నోటీసులు ఇచ్చామని తెలిపారు.
ఇకపై మోహన్ బాబు ఇంటి పరిసరాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఉండటానికి వీల్లేదని సుధీర్ బాబు చెప్పారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి చెక్ చేయమని పహాడీ షరీఫ్ పోలీసులకు సూచించామని తెలిపారు. తమ నోటీసులకు స్పందించి తమ ఎదుట మనోజ్ హాజరయ్యారని చెప్పారు. మనోజ్ ను సంవత్సరం పాటు బైండోవర్ చేస్తూ ఆదేశాలిచ్చామని తెలిపారు. బైండోవర్ నోటీసుకు కొంత సమయం కావాలని విష్ణు కోరారని... ఈ నెల 24వ తేదీ వరకు ఆయనకు సమయం ఇచ్చామని వెల్లడించారు. మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు మేనేజర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు.