Chandrababu: నాలెడ్జి సొసైటీ లక్ష్యానికి లోబడి విద్యావ్యవస్థలో మార్పులు రావాల్సి ఉంది: సీఎం చంద్రబాబు
- మానవ వనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
- అంతర్జాతీయ విద్యాసంస్థలకు దీటుగా కరిక్యులమ్ లో మార్పులు చేయాలని సూచన
- కలెక్టివ్ టీమ్ బిల్డింగ్ తో విద్యారంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్దేశం
నాలెడ్జి సొసైటీ మన ప్రభుత్వ లక్ష్యం... ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. మానవ వనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
"ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తేవాలి. ప్రైవేటు విద్యావ్యవస్థను తొక్కేయడం మన విధానం కాదు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్నదే తమ ధ్యేయం. రాబోయే రోజుల్లో నాలెడ్జి ఎకానమీలో తెలుగు విద్యార్థులు నెం.1గా నిలవాలి.
అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు ప్రత్యేక బృందాలను పంపి అక్కడ బోధన, అభ్యసన పద్ధతులపై అధ్యయనం చేయాలి. తదనుగుణంగా కరిక్యులమ్ లో మార్పులు చేసి, ఎన్ఐఆర్ఎఫ్, గ్లోబల్ ర్యాంకింగ్స్ మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. సివిల్ ఏవియేషన్, గ్రీన్ ఎనర్జీ, టూరిజం రంగాల్లో భవిష్యత్ అవకాశాలను అంచనావేసి ఆయా యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.
స్కిల్స్, ఎంప్లాయ్ మెంట్ ను బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. ఇందుకోసం అమరావతి రాజధానిలో ఏర్పాటుచేసే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో రాష్ట్రంలోని 5 జోన్లలోని స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలను అనుసంధానిస్తాం. డిజిటల్ టీచింగ్, లెర్నింగ్ పై దృష్టి సారించాలి.
సొసైటీ అవసరాలను బట్టి స్కిల్ అప్ గ్రేడేషన్ చేపట్టాలి. ఒకేషనల్ విద్యపై దృష్టిసారించాలి. పాఠశాలల్లో రేటింగ్ మెరుగుదలకు కలెక్టివ్ టీమ్ బిల్డింగ్ తో ర్యాంకింగ్స్ మెరుగుదలకు కృషిచేసి, విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులంతా కృషిచేయాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తిచేశారు.