Allu Arjun: రికార్డులు ఉన్నది బద్దలు కొట్టడానికే... కానీ!: అల్లు అర్జున్
- బ్రహ్మాండమైన విజయం సాధించిన పుష్ప-2
- రూ.1000 కోట్లతో చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా
- ఢిల్లీలో థాంక్యూ మీట్
- హాజరైన అల్లు అర్జున్
పుష్ప-2 చిత్రం భారతీయ సినీ రికార్డులన్నింటినీ వరుసగా బ్రేక్ చేస్తూ ఉండడం పట్ల చిత్రబృందం జోష్ అంబరాన్నంటుతోంది. ఆడియన్స్ తమ చిత్రానికి బ్రహ్మరథం పడుతుండడం పట్ల మేకర్స్ దేశవ్యాప్తంగా థాంక్యూ మీట్ లు ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నేడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన థాంక్యూ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"నేను ఎప్పుడూ చెబుతుంటాను... రికార్డులు ఉన్నది బద్దలు కొట్టడానికేనని! మరో రెండు, మూడు నెలలు పాటు నేను ఈ రికార్డులన్నింటినీ చక్కగా ఆస్వాదిస్తానేమో. కానీ, వచ్చే వేసవిలో విడుదలయ్యే సినిమాల్లో ఏదో ఒకటి నా సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని కోరుకుంటాను. ఈ వసూళ్ల అంకెలు తాత్కాలికం మాత్రమే... కానీ అభిమానులు, ప్రేక్షకులు చూపించే ప్రేమ మాత్రం నా హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
రికార్డ్ బ్రేకింగ్ సినిమాతో అగ్రస్థానంలో నిలవడం అద్భుతంగా అనిపిస్తోందని అన్నారు. కలెక్షన్స్ కూడా ముఖ్యమే... కాదనను... ఓ సినిమా రూ.1000 కోట్ల వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు కదా... అందులో నేను ఓ భాగం కావడం ఓ కలలా ఉంది అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.