Gukesh: మన తెలుగబ్బాయి గుకేశ్‌కు శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్ ట్వీట్

Chandrababu congratulates Telugu Boy Gukesh

  • 18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడన్న చంద్రబాబు
  • ఈ అద్భుత విజయాన్ని దేశమంతా పండుగలా జరుపుకుంటోందన్న ఏపీ సీఎం
  • ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడు అంటూ నారా లోకేశ్ ప్రశంస

అతిపిన్న వయస్సులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. మన తెలుగబ్బాయి, ఇండియన్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌కు హృదయ పూర్వక అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

18 ఏళ్లకే ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా అవతరించడం ద్వారా చరిత్ర సృష్టించాడని కొనియాడారు. ఈ అద్భుత విజయాన్ని దేశమంతా పండుగలా జరుపుకుంటోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

భారత సరికొత్త చెస్ ఛాంపియన్, మన తెలుగు వాడు గుకేశ్‌కు అభినందనలు అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. పద్దెనిమిదేళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడని కొనియాడారు. చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ లిరెన్‌ను ఓడించడం ద్వారా ఈ ఘనత సాధించాడని పేర్కొన్నారు. ఈ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయుడని, గుకేశ్ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. మీ విజయాన్ని చూసి భారత్ గర్విస్తోందని లోకేశ్ రాసుకొచ్చారు.

గుకేశ్ 2006లో చెన్నైలో తెలుగు దంపతులకు జన్మించాడు. అతని తండ్రి డాక్టర్ రజనీకాంత్, తల్లి డాక్టర్ పద్మ. తండ్రి ఈఎన్టీ సర్జన్ కాగా, తల్లి మైక్రోబయాలజిస్ట్. గుకేశ్ తన ఏడేళ్ల వయస్సు నుంచే చెస్ ఆడటం ప్రారంభించాడు.

  • Loading...

More Telugu News