Chandrababu: ఇక దూసుకుపోవడమే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు!
- జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు మార్గనిర్దేశం
- పనితీరు బాగోకపోతే పక్కన పెట్టేస్తానని హెచ్చరిక
- తన మార్క్ పాలన ఎలా ఉంటుందో చెప్పిన వైనం
- ప్రతి డిపార్ట్ మెంట్ గురించి మాట్లాడిన చంద్రబాబు
- రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే తన లక్ష్యమన్న సీఎం
- మనం ప్రజా సేవకులమే కానీ... పెత్తందారులం కాదని హెచ్చరిక
- పనితీరు బాగోకపోతే కలెక్టర్లయినా, మంత్రులయినా పక్కన పెట్టేస్తానని వార్నింగ్
ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సుదీర్ఘ పాలన అనుభవంతో మంత్రులు, జిల్లా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. నిన్న, మొన్న రెండు రోజుల పాటు జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు, మంత్రులతో చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశం దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
తొలి రోజు 9 గంటలు, రెండో రోజు 13 గంటల సేపు ఈ సమావేశాలు కొనసాగాయి. 22 గంటల సేపు కొనసాగిన ఈ సమావేశాల సందర్భంగా జిల్లా కలెక్టర్లు ఏం చేయాలనే దానిపై చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన మార్క్ పాలన ఎలా ఉంటుందో మరోసారి అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో ప్రతి డిపార్ట్ మెంట్ గురించి ఆయన మాట్లాడారు. మనం ప్రజా సేవకులమే కానీ... పెత్తందారులం కాదని హెచ్చరించారు. ప్రజలను ప్రభుత్వంలో భాగస్వాములుగా భావించాలని చెప్పారు.
ఈ సమీక్షా సమావేశాన్ని లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం గమనార్హం. కూటమి ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందనే విషయాలు అధికారులతో పాటు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేందుకు ఇది దోహదపడుతుండనడంలో సందేహం లేదు. ఈ సమావేశం ద్వారా ఏయే శాఖలు ఎలా ముందుకు సాగుతున్నాయనే విషయంపై ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న అన్ని డిపార్ట్ మెంట్ల ఉద్యోగులకు పూర్తి స్పష్టత వచ్చిందనడం అతిశయోక్తి కాదు.
తాను టీమ్ లీడర్ అని... మీరందరూ తనతో ఎలాంటి అరమరికల్లేకుండా మాట్లాడవచ్చని జిల్లా కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు చంద్రబాబు తెలిపారు. పనితీరు బాగోకపోతే జిల్లా కలెక్టర్లయినా, మంత్రులైనా పక్కన పెట్టేస్తానని హెచ్చరించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని... పనితీరు బాగున్న వారిని సరైన స్థానంలో పెడతానని చెప్పారు. నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలనేదే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని... దాన్ని సాధించాలంటే తాను కఠినంగా ఉండక తప్పదని అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయాలని... అలాగని వారు చెప్పిన పనులన్నీ చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెప్పారు. తప్పుడు పనులు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని చెప్పారు.
పెండింగ్ లో ఉన్న అర్జీలను మూడు నెలల్లో పరిష్కరించాలని... ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల వాతావరణాన్ని నెలకొల్పాలని అన్నారు. పాలనలో వేగం పెరగాలని... మార్పు అనేది స్పష్టంగా కనపడాలని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మీ పాత్ర చాలా కీలకమని అన్నారు. యంత్రాంగంలో అవినీతికి, నిర్లక్ష్యానికి తావు లేకుండా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి దానికి నిధులు అవసరం లేదని... వినూత్నమైన ఆలోచనలతో సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు.
జిల్లా కలెక్టర్లు లేవనెత్తిన ప్రతి అంశాన్ని విన్న చంద్రబాబు అక్కడికక్కడే వాటికి పరిష్కారాలను సూచించారు. పూర్తి సమాచారంతో రాని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన, సమాచారం లేకుండా రావడం వల్ల ఉపయోగం లేదని చెప్పారు. ప్రతి విషయంపై అందరికీ అవగాహన ఉండాలని అన్నారు.
చంద్రబాబు చెప్పిన కీలక అంశాలు:
- వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. రైతుకు చిన్న సమస్య కూడా రాకూడదు. పోర్ట్ అయినా, స్టీల్ ప్లాంట్ అయినా, ఏ అభివృద్ధి ప్రాజెక్ట్ అయినా రైతులను భాగస్వాములను చేయాలి.
- అమరావతి భూసేకరణ విధానం అత్యుత్తమ మోడల్.
- అన్ని ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ప్రాధాన్యతను ఇస్తాం.
- అమరావతి, తిరుపతి, విశాఖలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.
- దేశంలోని టాప్ టెన్ యూనివర్శిటీలు, స్కూళ్లు, ఆసుపత్రులు అమరావతిలో ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నాం.
- 2050 నాటికి అమరావతిలో 15 లక్షల ఉపాధి అవకాశాలు వస్తాయి. వీటిలో 20 నుంచి 25 శాతం ఉద్యోగాలు ఈ ఐదేళ్లలోనే వస్తాయి.
- ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
- విద్యుత్ ధరలు యూనిట్ కు 30 నుంచి 40 పైసలు తగ్గించాలి.
- పీఎం సూర్యఘర్ కింద ప్రతి ఇంటి మీద విద్యుత్ ఉత్పత్తి జరగాలి. ఉత్పత్తి అయిన విద్యుత్ ను ఉపయోగించుకుని... మిగిలిన దాన్ని అమ్ముకోవచ్చు. ఇళ్లపై విద్యుదుత్పత్తిని జిల్లా కలెక్టర్లు ప్రోత్సహించాలి.
- తూర్పు తీరంలో భారీ పోర్టును నిర్మించేందుకు కృషి చేస్తున్నాం.
- సముద్ర తీరం వెంట రహదారిని నిర్మించి దాన్ని జాతీయ రహదారులకు అనుసంధానించాలి.
- రాష్ట్రంలో ఎక్కడినుంచైనా గంట సమయంలో వెళ్లేలా విమానాశ్రయాలు ఉండాలి.
- కొందరు నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. వీటి నియంత్రణకు మంత్రులు లోకేశ్, అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.