Revanth Reddy: అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేస్తే అడుగుతున్నారు కానీ వారి గురించి ఎవరూ అడగడం లేదు: రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Revanth Reddy interesting comments on Allu Arjun arrest

  • చనిపోయిన మహిళ, ఆమె కొడుకు, కుటుంబం గురించి ఎవరూ అడగడం లేదన్న సీఎం
  • సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి తారలు కూడా అరెస్టయ్యారన్న సీఎం
  • సెలబ్రిటీ అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కాదని వ్యాఖ్య
  • ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్య
  • అల్లు అర్జున్ అర్ధాంగి తమ కుటుంబ సభ్యురాలేనన్న సీఎం

సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేస్తే అడుగుతున్నారు కానీ... చనిపోయిన మహిళ బాధ్యతను ఎవరు తీసుకుంటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చనిపోయిన మహిళ, ఆమె కొడుకు గురించి ఎవరూ అడగడం లేదన్నారు. మృతురాలు రేవతి కొడుకు కూడా ఇంకా ఆసుపత్రిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి... అల్లు అర్జున్ అరెస్ట్‌పై 'ఆజ్ తక్' కార్యక్రమంలో మరోసారి స్పందించారు.

సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఇలా చాలామంది సినీ తారలు అరెస్టయ్యారని గుర్తు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు పది రోజుల తర్వాత అరెస్ట్ చేశారని తెలిపారు. సెలబ్రిటీ అయినంత మాత్రాన ఎవరూ చట్టానికి అతీతులు కాదన్నారు. ఆయన థియేటర్ వద్ద కారు పైకి ఎక్కి ప్రేక్షకులను ఉత్తేజపరిచారని వెల్లడించారు. అందుకే థియేటర్ వద్ద పరిస్థితి చేయిదాటిపోయిందన్నారు.

సినిమాను చూడాలనుకుంటే హోం థియేటర్‌లో చూడవచ్చని లేదా ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. అల్లు అర్జున్ వస్తున్న విషయమై ముందస్తు సమాచారం లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి తనకు తెలుసునన్నారు. ఆయన అర్ధాంగి తన కుటుంబ సభ్యురాలే అవుతారని తెలిపారు. సినిమా వాళ్లు డబ్బులు పెట్టారు... డబ్బులు సంపాదించుకుంటున్నారని తెలిపారు.

ఇప్పుడు నేనే ఒక స్టార్‌ను...

తాను సూపర్ స్టార్ (కృష్ణ) అభిమానిని అని, ఇప్పుడు ఆయన లేరని వెల్లడించారు. ఇప్పుడు నేనే ఒక స్టార్‌ను అని, తనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాల గురించి ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను అడగాలని ఒక ప్రశ్నకు సమాధానంగా రేవంత్ రెడ్డి అన్నారు. 

  • Loading...

More Telugu News