G. Kishan Reddy: తెలంగాణలో సినిమా వాళ్లను టార్గెట్ చేస్తున్నారని నిరూపితమైంది: అల్లు అర్జున్ అరెస్ట్‌పై కిషన్ రెడ్డి వ్యాఖ్య

Kishan Reddy responds on Allu Arjun arrest

  • అరెస్ట్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం.. అసమంజసమన్న కిషన్ రెడ్డి
  • శాంతిభద్రతల అంశం పోలీసులు చూసుకోవాలన్న కిషన్ రెడ్డి
  • వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్న కేంద్రమంత్రి

తెలంగాణ రాష్ట్రంలో సినీ తారలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా మరోసారి నిరూపితమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ అరెస్ట్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని, అసమంజసమైనదని విమర్శించారు.

సంధ్య థియేటర్ ప్రీమియర్ షోకు సంబంధించి నిర్వాహకులు ముందుగానే అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారని, కాబట్టి ఈ అరెస్ట్ ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందన్నారు. శాంతిభద్రతల అంశం పోలీసులు చూసుకోవాలని, కానీ దానిని పక్కన పెట్టి ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు.

అల్లు అర్జున్ అరెస్టును, పాలకుల అధికార దుర్వినియోగాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాష్ట్రంలోని సినీ నటులను టార్గెట్ చేస్తున్నారనడానికి ఈ అరెస్ట్ నిదర్శనమన్నారు. 

కాగా, సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా, 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు, హైకోర్టులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించిన తర్వాత బెయిల్ వచ్చింది.

  • Loading...

More Telugu News