Allu Arjun: ఆ ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే అల్లు అర్జున్ అరెస్ట్: బీఆర్ఎస్ నేత
- లగచర్ల రైతు ఘటన నుంచి మీడియా దృష్టి మరల్చేందుకే అరెస్ట్ చేశారని విమర్శ
- కానీ అందులోనూ తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్న బీఆర్ఎస్ నేత
- సంధ్య థియేటర్ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని విమర్శ
లగచర్ల రైతును జైలు నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయంలో బేడీలు వేశారని, ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని, ఈ ఘటన నుంచి మీడియా అటెన్షన్‌ను తప్పించేందుకే సినీ నటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్ రెడ్డి ఆరోపించారు. కానీ అందులోనూ తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో రద్దీని అదుపు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్ రెడ్డి ఆరోపించారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ వెనుక డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అన్నారు.
పుష్ప సినిమా విడుదల సందర్భంగా ఈ నెల 4, 5వ తేదీల్లో భద్రత కల్పించాలని థియేటర్ యాజమాన్యం ముందుగానే అనుమతి తీసుకుందన్నారు. సినిమా చూడటానికి అల్లు అర్జున్ వస్తుండటంతో అదనపు భద్రత కల్పించాలని థియేటర్ యాజమాన్యం కోరినట్లు ప్రభుత్వానికి సమర్పించిన లేఖలో స్పష్టంగా ఉందన్నారు.
కానీ రద్దీని అదుపు చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. అన్ని అనుమతులు తీసుకున్నాక రద్దీని అదుపు చేయడంలో ఎవరు బాధ్యత వహించాలో చెప్పాలని నిలదీశారు. పోలీసుల వైఫల్యం వల్లే రేవతి అనే మహిళ మరణించారని ఆరోపించారు.