Travis Head: భారత్‌పై సెంచరీతో అత్యంత అరుదైన రికార్డు సాధించిన ట్రావిస్ హెడ్
- గబ్బా టెస్టులో 160 బంతుల్లోనే 152 పరుగులు సాధించిన హెడ్
- ఒక మైదానంలో జరిగిన రెండు వరుస టెస్టుల్లో అరుదైన రికార్డు
- ఒక మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్లు.. ఆ తర్వాత మ్యాచ్‌లో సెంచరీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ మరోసారి అదరగొట్టాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని అద్భుతమైన శతకాన్ని సాధించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి కేవలం 160 బంతుల్లోనే 152 పరుగులు సాధించాడు. ఇందులో 18 ఫోర్లు ఉన్నాయి. చివరికి బుమ్రా బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భారత్‌పై వరుస మ్యాచ్‌ల్లో ట్రావిస్ హెడ్ సెంచరీలు నమోదు చేశాడు.
ఇదిలావుంచితే, గబ్బా మైదానంలో సెంచరీ సాధించడం ద్వారా ట్రావిస్ హెడ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో ఒక మైదానంలో ఆడిన రెండు వరుస టెస్టుల్లో... తొలి మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యి.. మరుసటి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు.
ఈ ఏడాది జనవరిలో గబ్బాలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టులో హెడ్ ఘోరంగా విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్‌లో కెమర్ రోచ్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో జోసెఫ్ తొలి బంతికే హెడ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
కాగా, ట్రావిస్ హెడ్ కంటే ముందు పాకిస్థాన్ మాజీ ఆటగాడు వజీర్ మొహమ్మద్ 1958లో ‘పోర్ట్ ఆఫ్ స్పెయిన్’లో ఈ రికార్డు నెలకొల్పాడు. 1974లో అల్విన్ కాళీచరణ్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్), 2021లో మర్వన్ ఆటపట్టు (కొలంబో), 2004లో రాంనరేశ్ సర్వాన్ (కింగ్‌స్టన్), 2004లో మహ్మద్ అష్రాఫుల్ (చటోగ్రామ్) కూడా ఈ ఫీట్‌ను సాధించారు.