Manchu Manoj: మంచు విష్ణు మా జనరేటర్ లో చక్కెర పోయించాడు: మంచు మనోజ్ ఆరోపణ
- మంచు కుటుంబంలో కొనసాగుతున్న వివాదం
- విష్ణుపై తీవ్ర ఆరోపణలతో మనోజ్ ప్రకటన విడుదల
- ఘటనపై అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరిన మనోజ్
మంచు కుటుంబంలో తండ్రీ తనయులు, అన్నదమ్ముల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. మంచు కుటుంబంలోని సభ్యులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం, మీడియాలో ప్రముఖంగా రావడంతో ఈ అంశం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మంచు మనోజ్ తాజా ఆరోపణలతో మరో వివాదం తెరపైకి వచ్చింది.
విష్ణు .. తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేయించాడని మనోజ్ ఆరోపిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తాను సినిమా షూటింగ్‌కు వెళ్లిన సమయంలో విష్ణు.. తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్‌లతో ఇంట్లోకి ప్రవేశించి జనరేటర్‌లో పంచదార పోయించాడని, దీంతో రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మనోజ్ పేర్కొన్నాడు.
జనరేటర్ సమీపంలోనే వాహనాలు, గ్యాస్ కనెక్షన్ ఉన్నాయని, వారి చర్యలతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో భయపడ్డామన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నానని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మనోజ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.